భీమిని: తన భూమిని ఇతరుల పేరిట పట్టా చేశారంటూ ఆరోపిస్తూ ఓ రైతు కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో పురుగుల మందు డబ్బాతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చిన్నగుడిపేటకు చెందిన రైతు రెడ్డి స్వామి గ్రామ శివారులోని సర్వే నంబర్ 107లో 2.16 ఎకరాల భూమిని పదేళ్ల క్రితం ఏటకారి రామయ్య దగ్గర కొనుగోలు చేశాడు. కాగా, ఈ భూమిలోంచి 1.16 ఎకరాలు కమలాపూర్ ప్రాజెక్ట్ కాలువలో ముంపునకు గురైంది. మిగతా ఎకరంలో తాను పంటలు సాగు చేస్తున్నాడు. కాగా, తన భూమిని మరొకరికి పట్టా చేయించారని స్వామి ఆరోపిస్తూ తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు డబ్బాతో భార్యాపిల్ల్ల లతో కలిసి తహసీల్దార్ కార్యాలయం ఆవరణలోనే తాగడానికి యత్నించాడు. దీంతో అక్కడున్న వారు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై కోటేశ్వర్ తన సిబ్బందితో చేరుకుని సదరు రైతు నుంచి పురుగుల మందు డబ్బా లాక్కున్నాడు. తనకు దక్కాల్సిన భూమిని మరొకరి పేరిట పట్టా చేశారని, తనకు న్యాయం చేయాలని అధికారులను వేడుకున్నాడు. అనంతరం బాధితులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. భూమి కొనుగోలు వ్యవహారంలో తనను మోసం చేసిన ముగ్గురిపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో స్వామి ఫిర్యాదు చేశాడు. దీంతో ముగ్గురిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్సై తెలిపారు. ఈ విషయమై తహసీల్దార్ బికర్ణదాస్‌ను వివరణ కోరగా నిబంధనల మేరకు సదరు వ్యక్తులు స్లాట్‌బుక్ చేసుకోవడంతో వారి పేరిట రిజిస్ట్రేషన్ చేశామని వివరించారు.


