చదువుదాం.. విజ్ఞానం పెంచుకుందాం వేసవిలో సమయం వృథా చేయొద్దంటున్న నిపుణులు కథలు చదివేలా తల్లిదండ్రులు చొరవ చూపితే మేలంటున్న నిపుణులు
లక్ష్మణచాంద:పాఠశాలల విద్యార్థులకు వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి. సెలవుల్లో విద్యార్థులు ఇంటివద్ద మొబైల్ ఫోన్లలో పనికి రాని గేములు, అనవసరమైన సినిమాలు, పాటలు చూసి సమయం వృధా చేయకుండా మంచి పుస్తకాలు చదివేలా అంతర్జాలం వినియోగించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
కథలు చదివేలా...
గతంలో వేసవి సెలవులు వచ్చాయంటే చాలు తల్లిదండ్రులు తమ పిల్లలను పల్లెటూర్లలో ఉన్న అమ్మమ్మ, తాతయ్యల ఇళ్లకు తీసుకెళ్లేవారు. రాత్రి అయ్యిందంటే చాలు అక్కడ ఆరు బయట మంచాలు వేసుకుని తాతయ్య, అమ్మమ్మలు పిల్లలను తమ వద్ద కూర్చోబెట్టుకుని ఆకాశంలో చుక్కలను చూపిస్తూ ‘అనగనగా ఒక రాజు.. ఆ రాజుకు నలుగురు కుమారులు..’ అంటూ మంచి మంచి నీతి కథలు చెప్పేవారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు కానరావడం లేదు.
అంతర్జాలంలో ఎన్నో...
కాలం మారింది. కథలు చెప్పే తాతయ్యలు లేరు. ప్రస్తుతం మొబైల్ ఫోన్‌లో అంతర్జాలంలో చాలా కథల బ్లాగులు ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. వాటిని ఆన్‌లైన్‌లో పిల్లలు చదివేలా తల్లిదండ్రులు చొరవ చూపాలని కోరుతున్నారు. నీతి కథలు, రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలు, మహనీయుల జీవిత చరిత్రలు వంటివి పిల్లలు చదివేలాగా తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
బాల వినోదం బ్లాగ్‌స్పాట్.ఇన్
అంతర్జాలంలో బాలవినోదం బ్లాగ్‌స్పాట్.ఇన్ వెబ్‌సైట్‌లో కథలు ఉన్నాయి. యానిమేటెడ్ చిత్రాలతో ఈ వెబ్‌సైట్‌ను రూపొందించారు. ప్రతీపేజీలో అందమైన డిజైన్లతో కూడిన బొమ్మలు, నీతి కథలు కనిపిస్తాయి. పిల్లలకు ఇందులో ఫొటో కాంటెస్ట్ పరీక్ష కూడా ఉంటుంది.
మ్యాజిక్‌కీస్.కామ్
ఇది మరొక వైబ్‌సైట్. ఈ వెబ్‌సైట్ ద్వారా పిల్లలు స్టోరీ బుక్‌లోకి లాగిన్ కావాల్సి ఉంటుంది. ఇందులో యానిమేషన్‌తో కూడిన కథలు చాలా ఉంటాయి. చిట్టి పొట్టి కథల పుస్తకాలతో పాటు మనకు కావాల్సిన వివిధ రకాల పుస్తకాలు కొనుగోలు చేసేందుకు కూడా అవకాశం ఉంది.
పిల్లలను ఇట్టే ఆకట్టుకునేందుకు వివిధ రకాల బొమ్మలతో కూడిన కథలు గల మంచి పుస్తకం.ఇన్ అనే వెబ్‌సైట్ ఉంది. ఇందులో ప్రధానంగా పరమానందయ్య శిష్యులు, చిట్టి చిలుకమ్మా, చిట్టి కథలు.. వంటివి ఉంటాయి. వీటిని పిల్లలు చూడవచ్చు.


