ఈ ఏడాది నుంచి ప్రారంభం ఎంపీసీ, బైపీసీ గ్రూపులతో పాటు సివిల్స్ ఫౌండేషన్ కోర్సు విలువలతో కూడిన విద్య, చక్కటి వసతి
కడెం: విద్య, వినయం, విధేయతతో కూడిన విద్య కు ప్రతి రూపంగా నిలుస్తోంది. కడెం మండలంలోని అల్లంపల్లి జీయర్ గురుకుల పాఠశాల. మారుమూల గ్రామాల పిల్లలకు నేటికీ విద్య అందని ద్రాక్షే. కనీస మౌలిక సౌకర్యాలు నోచుకొని గిరి గ్రామంలో చిన జీయర్‌స్వామి సకల వసతులతో గురుకుల పాఠశాలను నెలకొల్పి కార్పొరేట్ స్థాయి విద్యనందిస్తున్నారు. గురుకులంలో ఈ విద్యాసంవత్సరం నుంచి కళాశాలను ప్రారంభిస్తున్నారు.
ఇంటర్ విద్య..
మండలంలోని అల్లంపల్లిలో పాఠశాల విద్యనే అందని ద్రాక్షగా మారింది. ఈ తరుణంలో చిన జీయర్‌స్వామి చొరవతో 2004లో ఇక్కడ జీయర్ గురుకులాన్ని స్థాపించారు. ఇందులో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉచిత వసతితో కూడిన విద్యను అందిస్తున్నారు. ఈ ఏడాది నుంచి గురుకులంలో ఇంటర్ కళాశాలను ప్రారంభిస్తున్నారు. ఎంపీసీ, బైపీసీ గ్రూపులతో పాటు మారుమూల విద్యార్థులు సివిల్స్ సాధించేలా సీబీఎస్ అకాడమీ వ్యవస్థాపకురాలు బాలలత ఆధ్వర్యంలో సివిల్స్ ఫౌండేషన్ కోర్సు అందించనున్నారు. కార్పొరేట్ స్థాయి కళాశాల, హాస్టల్ వసతికి ఏడాదికి నామమాత్రంగా ఎస్టీ విద్యార్థులకు రూ.10 వేలు, ఇతరులకు రూ.50 వేలు ఫీజు నిర్ణయించారు.
గురుకుల విద్యార్థులు మెరికలు
చినజీయర్‌స్వామి గురుకుల పాఠశాల విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, యోగా, అర్చరీలో రాష్ట్రస్థాయిలో రాణిస్తున్నారు. ఇక్కడ విద్యను అభ్యసించిన ఎంతోమంది విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలనే తల్లిదండ్రులు కళాశాలలో ప్రవేశం కొరకు 8179923758, 9951666316 నంబర్లలో సంప్రదించాలని జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ (జెట్) అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రావు, ప్రిన్సిపాల్ అడెపు మహేందర్ కోరారు.


