గోదావరిలో మునిగి వృద్ధుడు మృతి | - | Sakshi
Sakshi News home page

గోదావరిలో మునిగి వృద్ధుడు మృతి

Apr 29 2026 7:54 AM | Updated on Apr 29 2026 7:54 AM

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): ప్రమాదవశాత్తు గోదావరిలో నీటమునిగి వృద్ధుడు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. ఎస్సై కిరణ్‌కుమార్‌ తెలిపిన వివరాల మేరకు రంగంపేటకు చెందిన కాయితీ మల్లయ్య (66)కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సోమవారం పాతమంచిర్యాలకు చెందిన ముదాం ఉమాకర్‌కు చెందిన గేదెలను మేపేందుకు ముల్కల్ల శివారులోని గోదావరివైపు వెళ్లాడు. సాయంత్రం గోదావరి నీటిలో సేద తీరుతున్న గేదెలను తోలుకు రావడానికి నీటిలోకి దిగాడు. లోతు ఎక్కువగా ఉండటంతో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. మంగళవారం ఉదయం మృతదేహం గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతునికి భార్య రాజేశ్వరి, కుమారుడు కుమార్‌, కుమార్తెలు మానస, మల్లీశ్వరి ఉన్నారు. మృతుని కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

వడదెబ్బతో ఒకరు..

వాంకిడి: చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి వడదెబ్బతో మృతి చెందిన ఘటన మంగళవారం మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై మహేందర్‌ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని కొత్త దుబ్బగూడకు చెందిన చిచోల్కర్‌ రాందాస్‌(44) చేపలు పడుతూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం ఉదయం చిచోల్కర్‌ శంకర్‌, బోయిరె శ్రావణ్‌తో కలిసి చేపలు పట్టేందుకు అడ ప్రాజెక్టుకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చారు. కొద్ది సేపటికి వాంతులు, విరేచనాలు కావడంతో రాందాస్‌ స్పృహ కోల్పోయాడు. కుటుంబ సభ్యులు ఆసిఫాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుని తండ్రి పొచ్చు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతునికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. పదేళ్ల క్రితం తల్లి, ప్రస్తుతం తండ్రి మృతితో పిల్లలిద్దరూ అనాధలుగా మిగిలారు. ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరు..

లక్సెట్టిపేట: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై గోపతి సురేష్‌ తెలిపిన వివరాల మేరకు హాజీపూర్‌ మండలం సబ్బపల్లికి చెందిన తురుపాటి పౌల్‌ (44) గ్యాస్‌ స్టౌవ్‌లు రిపేరు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడన్నాడు. వృత్తిలో భాగంగా మంగళవారం ద్విచక్ర వాహనంపై దండేపల్లి వైపు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన జీబు ఢీ కొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108లో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌కు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. మృతుని కుమారుడు మనోజ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

మట్కా నిర్వాహకుడిపై కేసు

ఆదిలాబాద్‌టౌన్‌: మట్కా నిర్వహిస్తున్న ఆదిలాబాద్‌ పట్టణంలోని మహాలక్ష్మి వాడకు చెందిన క్యాతం శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసినట్లు టూటౌన్‌ సీఐ నాగరాజు తెలిపారు. మంగళవారం నిందితుడు మట్కా ఆడుతుండగా పట్టుకుని అతని వద్ద నుంచి రూ.300 నగదు, సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement