ఉట్నూర్‌రూరల్: సబ్సిడీ పేరుతో రైతులను మోసగించిన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ మడావి ప్రసాద్ తెలిపారు. మంగళవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చంద్రవెల్లికి చెందిన కామెర చంద్రమౌళి మంచిర్యాల లోని ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్‌లో మేనేజర్‌నని, భారత్ కిసాన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ద్వారా ట్రాక్టర్లు , ఇతర పరికరాలు 50 శాతం సబ్సిడీపై ఇప్పిస్తానని భూపేటకు చెందిన రాజమౌళి వద్ద ట్రాక్టర్ కోసం రూ.4 లక్షలతో పాటు డాక్యుమెంట్ చార్జీల పేరుతో రూ.36 వేలు, గంగన్నపేట్‌కు చెందిన బోర్లకుంట రాజన్న వద్ద రూ.4.25 లక్షలు, దంతనపల్లికి చెందిన సింగిరెడ్డి రవీందర్ రెడ్డి వద్ద గడ్డి కట్టల యంత్రం పేరుతో రూ.1.70 లక్షలు, అదే గ్రామానికి చెందిన కొమ్ముల సందీప్ రెడ్డి వద్ద రూ.1.70 లక్షలు వసూలు చేశాడు. గతేడాది ఆగస్టులో సదరు రైతుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తమకు అందిన సమాచారం మేరకు మంగళవారం ఉట్నూర్ వినాయక చౌక్ వద్ద నిందితుడిని ఎస్సై విజయ్, పోలీస్ సిబ్బంది భూపతి, నరేష్, తానాజీ అరెస్టు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. నిందితుడిపై మంచిర్యాల, జగిత్యాల, భూపాలపల్లి జిల్లాల్లోని పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నట్లు పేర్కొన్నారు.


