నస్పూర్: పేదల అభ్యున్నతికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని మంచిర్యాల నగర మేయర్ ధర్ని మధుకర్ అన్నారు. ప్రజాపాలన–ప్రగతి పాలన కార్యక్రమంలో భాగంగా గురువారం 32వ డివిజన్‌లో వార్డు సభ నిర్వహించారు. అధికారులు సీఎం రేవంత్‌రెడ్డి సందేశాన్ని చదివి వినిపించారు. అనంతరం మేయర్ మధుకర్ మాట్లాడుతూ నగరంలో అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కోల్‌బెల్ట్ పరిధిలో సింగరేణి రిటైర్డ్ కార్మికులకు తెల్ల రేషన్ కార్డులు ఇప్పించిన ఘనత తమేదనని అన్నారు. మంచిర్యాల శుభ్రత ప్రతీ ఒక్కరి బాధ్యత నినాదంతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టి ప్రతీ డివిజన్‌లో తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ, అంతర్గత రోడ్లు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని చెప్పారు. వార్డు సభల్లో తమ దృష్టికి వచ్చిన ప్రతీ సమస్యను ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. కాగా, 10వ డివిజన్‌లో కార్పొరేటర్ రాచకొండ గోపాల్‌రావు, 24వ డివిజన్‌లో కార్పొరేటర్ బొడ్డు స్వప్న, 25వ డివిజన్‌లో కార్పొరేటర్ తోట రజిత, హౌసింగ్ ఏఈ ప్రశాంతి, టీపీఎస్ అవినాష్, ఆర్‌ఐ చందర్, విద్యుత్ శాఖ ఏఐ రాంచందర్, వార్డు ఆఫీసర్లు శీపతి సురేశ్, రాజమణి, రమణారెడ్డి, గోపి, ఏఎన్‌ఎంలు, ఆశాలు పాల్గొన్నారు.


