జైపూర్: ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తోందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. మండలంలోని టేకుమట్ల గ్రామ రైతువేదికలో గురువారం నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. 99రోజుల కార్యాచరణ ప్రణాళికకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి సందేశాన్ని అధికారులు చదివి వినిపించారు. అనంతరం కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ ఈ నెలలో మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీకి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థికాభివృద్ధికి వడ్డీ లేని రుణాలు అందించి వివిధ వ్యాపార రంగాల్లో ప్రోత్సహిస్తున్నామని, రుణం పొందిన సభ్యులు సకాలంలో చెల్లించి మళ్లీ పొందాలని చెప్పారు. వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు సుచరిత, జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ, ఎంపీడీవో సత్యనారాయణ, సర్పంచ్ బల్ల వెంకటేశ్, అధికారులు పాల్గొన్నారు.


