కన్నోళ్లకు ఊరట | - | Sakshi
Sakshi News home page

కన్నోళ్లకు ఊరట

Apr 3 2026 7:38 AM | Updated on Apr 3 2026 7:38 AM

పేరంటల్‌ సపోర్ట్‌ యాక్ట్‌తో వృద్ధులకు భరోసా తల్లిదండ్రుల పోషణ బాధ్యత పిల్లలదే బిల్లు పరిధిలోకి ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం చేస్తే జీతం నుంచి 15 శాతం లేదా రూ.10 వేలు కోత..

నిర్మల్‌చైన్‌గేట్‌: కనీ పెంచి ప్ర యోజకులను చేసిన తల్లిదండ్రులను కొందరు పట్టించుకోవడం లేదు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను భారంగా భావిస్తున్నారు. తమను సరిగా చూసుకోవడం లేదని ఎందరో వృద్ధ తల్లిదండ్రులు వయోవృద్ధుల ట్రిబ్యునళ్లను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి వారికి భరోసా కల్పించేందుకు తెలంగాణ ఎంప్లాయీస్‌ అకౌంట బిలిటీ అండ్‌ మానిటరింగ్‌ ఆఫ్‌ పేరంటల్‌ సపోర్ట్‌ యాక్ట్‌–2026 (టీఈఏఎంపీఎస్‌) పేరుతో ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందింది. ఇది పిల్లల నిర్లక్ష్యానికి గురయ్యే తల్లిదండ్రులకు అండగా నిలవనుంది.

తల్లిదండ్రుల ఆత్మగౌరవం కాపాడేందుకు..

పేద కుటుంబాల్లోని వృద్ధులు, వితంతువులకు ప్రభుత్వం అందించే పెన్షన్లు ఆసరాగా నిలుస్తున్నాయి. అయితే ఉద్యోగం చేసే సంతానం ఉన్న వారికి పెన్షన్‌ రాకపోవడంతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్ర భుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ‘తల్లిదండ్రుల మద్దతు బిల్లు’ను కేబినెట్‌ ఆమోదించింది. దీని ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు చేసేవారితో పాటు ప్రజాప్రతి నిధులు తమ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే.. వారి జీతం నుంచి 15 శాతం లేదా రూ.10 వేల చొప్పున కోత విధించి తల్లిదండ్రుల ఖాతాల్లో వేస్తారు. ఈ చట్టాన్ని పక్కాగా అమలు చేస్తే నిరాదరణకు గురవుతున్న ఎంతోమంది తల్లిదండ్రులకు మేలు జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

విశ్రాంత ఉద్యోగులకూ తప్పని కష్టాలు

ఉద్యోగం చేసి రిటైరైన పెన్షనర్లలో చాలామంది తమ సంతానం నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెల నెలా వచ్చే పింఛన్‌ డబ్బుల కోసం వేధించే వారు ఎందరో ఉన్నారు. కొందరైతే తల్లి లేదా తండ్రి బ్యాంకు పాస్‌ పుస్తకం, ఏటీఎం కార్డులను తమవద్దే ఉంచుకుని, వారి పెన్షన్‌ ఎప్పటికప్పుడు ఖాళీ చేస్తున్నారు.

ఫిర్యాదు చేయండిలా..

బాధిత తల్లిదండ్రులు ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లో జిల్లా కలెక్టరేట్లలో ఫిర్యాదు చేయవచ్చు. కేవలం 45 రోజుల్లోనే సమస్యను పరిష్కరించేలా గడువు విధించడం ఈ చట్టంలోని మరో ముఖ్యమైన అంశం. ఒకవేళ కలెక్టర్‌ తీర్పుతో సంతృప్తి చెందకపోతే, రిటైర్డ్‌ జడ్జి నేతృత్వంలోని ప్రత్యేక కమిషన్‌ను ఆశ్రయించే వెసులుబాటు కూడా కల్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement