ముధోల్: హనుమాన్ జయంతిని పురస్కరించుకుని మండల కేంద్రంలో గురువారం వీడీసీ ఆధ్వర్యంలో కుస్తీ పోటీలు నిర్వహించారు. ముధోల్‌తో పాటు పక్క మండలాలు, మహారాష్ట్ర నుండి వచ్చిన మల్లయోధులు పోటీల్లో తలబడ్డారు. మొదటి విజేతకు రూ.5వేలు, రెండో విజేతకు రూ. 2,500 బహుమతిగా అందజేశారు.
గూడెంలో పౌర్ణమి జాతర
దండేపల్లి: మంచిర్యాల జిల్లాలోనే ప్రసిద్ధి చెందిన దండేపల్లి మండలం గూడెం శ్రీసత్యనారాయణస్వామి ఆలయంలో గురువారం చైత్రపౌర్ణమి జాతర ఘనంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి సత్యదేవున్ని దర్శించుకున్నారు. 178 జంటలు సామూహిక సత్యనారాయణ వ్రతాలు నోముకున్నారు. దీంతో ఆలయ ప్రాంగణాలు భక్తులతో రద్దీగా కనిపించాయి. జాతరకు వచ్చిన భక్తులకు ఆలయం తరుపున ఉచిత అన్నదానం చేశారు.
దొంగతనం, దాడి కేసులో నిందితుడి రిమాండ్
ఆదిలాబాద్‌రూరల్: దొంగతనం, దాడి కేసులో ఆదిలాబాద్ పట్టణంలోని నీలానగర్‌కు చెందిన ఆటోడ్రైవర్ సొంకాంబ్లే బయ్యసాహెబ్‌ను 24 గంటల్లోనే అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన ట్లు మావల ఎస్‌హెచ్‌ఓ, ఐపీఎస్ అధికారి రాహుల్ కాంత్ తెలిపారు. ఆదిలాబాద్‌లోని శాంతినగర్ కాలనీకి చెందిన కుర్సెంగా మాణిక్‌రావుకు సొంకాంబ్లే బయ్యసాహెబ్ తక్కువ ధరకు ప్లాట్ చూపిస్తానని మార్చి 31న డుబ్బ గూడ బైపాస్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ మద్యం తాగించి డబ్బులు, మొ బైల్, బైక్ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. బాధితుడు ప్రతిఘటించగా రాయితో తలపై దాడి చేశాడు. డబ్బులు, మొబైల్, బైక్ తో పారిపోయాడు. ఈనెల1న బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఎస్సై కె.రాజశేఖర్‌రెడ్డి దర్యాప్తు చేశారు. గురువారం దస్నాపూర్ సమీపంలో సొంకాంబ్లే బయ్యసాహెబ్‌ను అదుపులోకి తీసుకుని బైక్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చగా రిమాండ్‌కు తరలించారు.
పురుగుల మందు తాగి ఒకరు ఆత్మహత్య
భీమిని: పురుగుల మందు తాగి ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై భాస్కర్‌రావు తెలిపిన వివరాల మేరకు కన్నెపల్లి మండలంలోని లింగాలకు చెందిన జంపాల తిరుపతి (35) రూ.2 లక్షల వరకు అప్పుల పాలయ్యాడు. ఈక్రమంలో మద్యానికి బానిసయ్యాడు. బుధవారం రాత్రి గుర్తుతెలియని పురుగుల మందు తాగడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతుని సోదరుడు అంజన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.


