గాలివాన బీభత్సం | - | Sakshi
Sakshi News home page

గాలివాన బీభత్సం

Apr 1 2026 8:00 AM | Updated on Apr 1 2026 8:00 AM

● నేలకొరిగిన పంటలు ● 2,171 ఎకరాల్లో నష్టం

మంచిర్యాలఅగ్రికల్చర్‌: జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. అకాల వర్షం రైతులను ఆగం చేసింది. సోమవారం అర్ధరాత్రి బలమైన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షం దిగుబడి దశలో ఉన్న పంటలను దెబ్బతీసింది. జన్నారం, దండేపల్లి, లక్సెట్టిపేట, హాజీపూర్‌ మండలాల్లోని 53 గ్రామాల్లో 1,396 మంది రైతులకు చెందిన 2,171 ఎకరాల్లో వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమిక సర్వేలో గుర్తించారు. నెన్నెల, బెల్లంపల్లి, తాండూర్‌, మందమర్రి, భీమారం, జైపూర్‌, హాజీపూర్‌ మండలాల్లో 748 ఎకరాల్లో దిగుబడి దశలో ఉన్న మామిడి కాయ నేలరాలి తీవ్ర నష్టం వాటిల్లింది. ఇప్పటికే చేతికి వచ్చిన మిర్చి పంటకూ నష్టం వాటిల్లింది. పొట్ట, గులక దశలో ఉన్న వరి పంట, మరో పదిహేను రోజుల్లో దిగుబడి రానున్న మొక్కజొన్న పంట వందల ఎకరాల్లో నేల వాలింది. చేతికందే సమయంలో చెడగొట్టు వాన దెబ్బతీసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈదురుగాలులతో చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్‌ తీగలపై పడడంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఇళ్ల పైరేకులు ఎగిరి దూరంగా పడ్డాయి. వర్షంతో రోడ్లన్నీ చిత్తడిగా మారాయి. అకాల వర్షంతో నష్టపోయిన పంటలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందించి పరిహారం అందేలా చూడాలని రైతులు వేడుకుంటున్నారు.

జిల్లాలో 10.9 మిల్లీమీటర్ల వర్షం..

జిల్లాలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం వరకు 10.9 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. బెల్లంపల్లి మండలంలో 27.7 మిల్లీమీటర్లు, తాండూర్‌లో 26, చెన్నూర్‌లో 19.3, లక్సెట్టిపేటలో 19.2, దండేపల్లిలో 17.1, జన్నారంలో 14.3, కాసిపేటలో 12.6, నెన్నెలలో 9.9, హాజీపూర్‌లో 8.9, భీమినిలో 7.2, మంచిర్యాలలో 7.1, కన్నెపెల్లిలో 6.1, మందమర్రిలో 5.3, నస్పూర్‌లో 5, జైపూర్‌లో 3.6, భీమారంలో 2.8, కోటపల్లిలో 2.4, వేమనపల్లిలో 2.4 మిల్లిమీటర్ల వర్షం కురిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement