బెల్లంపల్లి: స్వయం ఉపాధి కోర్సులు నేర్చుకుని మహిళలు ఆర్థిక ప్రగతి సాధించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం మండలంలోని బట్వాన్‌పల్లి గ్రామ పంచాయతీ లంబాడితండా, తాళ్లగురిజాల గ్రామాల మహిళలకు అలీవ్ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. గ్రామంలో తాళ్లగురిజాల పీహెచ్‌సీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్షయ వ్యాధి నిర్ధారణ శిబిరాన్ని సందర్శించారు. ఆయా కార్యక్రమాల్లో డీఆర్‌డీఏ ప్రాజెక్టు అధికారి కిషన్, డీపీఎం సారయ్య, ఏపీఎం విజయలక్ష్మి, ప్రోగ్రాం అధికారి డాక్టర్ సుధాకర్‌నాయక్, మెడికల్ అధికారి డాక్టర్ ఎవాంజలీన, సర్పంచ్‌లు సింగతి రాజేష్, వంగ రాము, సాగర్ల లక్ష్మణ్, అలీవ్ సంస్థ వ్యవస్థాపకుడు కాశీం పాల్గొన్నారు.
11మందికి షోకాజ్ నోటీసులు
విధి నిర్వహణలో సమయపాలన పాటించని సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. బుధవారం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిజిష్టర్లు, రెవెన్యూ రికార్డులు పరిశీలించారు. హాజరు పట్టిక పరిశీలించి 11మంది సమయపాలన పాటించనట్లు గుర్తించారు. వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.
వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
మంచిర్యాలటౌన్: జిల్లా ప్రజలు అసంక్రమణ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ అనిత అన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 15వరకు అసంక్రమణ వ్యాధులు, హెచ్‌ఐవీ ఎయిడ్స్ వ్యాధి నియంత్రణ కార్యక్రమాల వైద్య శిబిరాల నిర్వహణను పాతమంచిర్యాలలో బుధవారం ప్రారంభించారు. ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఏ.ప్రసాద్, డాక్టర్ అశోక్, డెమో బుక్క వెంకటేశ్వర్, సీహెచ్‌వో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


