మంచిర్యాలఅర్బన్: పేద, ధనిక తారతమ్యం లేకుండా ఉండేందుకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం యూనిఫామ్(ఏకరూప దుస్తులు) అందిస్తోంది. వచ్చే విద్యాసంవత్సరం పునఃప్రారంభం నాటికి అందడం కష్టమేనని తెలుస్తోంది. ముడివస్త్రం ఇప్పటివరకు జిల్లాకు చేరకపోవడంతో మరింత ఆలస్యమయ్యే అవకాశం ఏర్పడింది. గతంలో యూనిఫామ్‌కు అవసరమైన వస్త్రం మార్చిలో ఎమ్మార్సీలకు చేరగా.. ఇప్పటివరకు ముడివస్త్రంపై స్పష్టత లేకుండా పోయింది. వస్త్రం వచ్చేదెన్నడో.. కుట్టు కోసం దర్జీ చెంతకు వెళ్లేదెన్నడో చూస్తే ఈ ఏడాది ఎదురుచూపులు తప్పేలా లేవు. సర్కారు పాఠశాలలు తెరిచే నాటికే విద్యార్థులకు ఏకరూప దుస్తులు అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. కానీ.. ఇప్పటివరకు జిల్లాకు ముడివస్త్రం రాలేదు. గత ఏడాది విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ముడివస్త్రానికి సంబంధించిన లెక్కలు తీసి ముందస్తు చర్యలు చేపట్టినా ఆగస్టు దాటిన తర్వాత యూనిఫామ్ రెండో జత పంపిణీ ప్రక్రియ కొసాగింది. దీంతో ఒకే జతతో ఇబ్బందులు పడ్డారు. అప్పట్లో వర్షాలు కురవడం వల్ల తడిసిన దుస్తుల స్థానంలో సాధారణ దుస్తులతో స్కూల్‌కు వచ్చారు. ఒకే యూనిఫాంను ఉతికి ఆరేయడం వల్ల రంగు వెలిసి పాతవాటిగా కనిపించాయి.
సరఫరాలో ఇబ్బందులు
వస్త్రం సరఫరాలో జాప్యం కారణంగా ఇబ్బందులు తలెత్తనున్నాయి. మార్చిలోనే ఎమ్మార్సీలకు చేరాల్సి ఉంది. ముడివస్త్రం జిల్లాకు, అక్కడి నుంచి మండలాలు, పాఠశాలలకు చేరవేస్తారు. దుస్తులు కుట్టేందుకు గ్రామాల్లోని స్వయం సహాయక సంఘాలకు ఏప్రిల్‌లో అందించేవారు. మే నెలాఖరు నాటికి కుట్టి పాఠశాలలకు అప్పగించేవారు. ముడిసరుకు ఆలస్యం, సమయం తక్కువగా ఉండడం, విద్యార్థుల సంఖ్య ఎక్కువగా కావడం వల్ల కుట్టడంలో మరింత జాప్యం కానుంది.
పొట్టిగా.. పొడుగ్గా..
గత ఏడాది 774 సర్కారు బడుల్లో చదివే 43,614మంది విద్యార్థులకు రెండు జతల యూనిఫాంలు అందించారు. దుస్తులు కుట్టేందుకు 961 మంది స్వయం సహాయక సంఘాలకు అప్పగించగా.. జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉన్న మండలంతోపాటు మరో మండలంలో యూనిఫాంలు అప్పగించడంలో నిర్లక్ష్యం వహించారు. పదే పదే ఫోన్లు చేసినా సకాలంలో అప్పగించలేదని తెలుస్తోంది. సాధారణంగా ఒక్కో విద్యార్థి కొలతలు తీసుకుని వాటికి అనుగుణంగా కుడితే దుస్తులు చక్కగా అమరుతాయి. ఇదివరకు తరగతుల వారీగా ఓ విద్యార్థి నుంచి కొలత తీసుకుని దాని ఆధారంగా దుస్తులు కుట్టడం వల్ల విద్యార్థులు వేసుకోలేక అవస్థలు పడ్డారు. పొట్టి నెక్కర్లు, అంగీలతోపాటు గుండీలు ఊడిపోయాయి. దీంతో విద్యార్థులకు మరో జతను దుకాణాల్లో కొనుగోలు చేయడం వల్ల తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడింది. ముడివస్త్రం సరఫరాలో ఆలస్యాన్ని సాకుగా చూపే అవకాశాలు లేకపోలేదు. స్కూల్ యూనిఫాం పొట్టిగా.. పొడుగ్గా లేకుండా సకాలంలో అందించాలని పలువురు కోరుతున్నారు.


