కాసిపేట: వర్షం కారణంగా మండలంలోని దేవాపూర్, చింతగూడ శివారు అటవీప్రాంతానికి ముప్పు తప్పింది. వివరాలు.. సోమవారం సాయంత్రం అడవిలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో మంటలు చెలరేగాయి. రాత్రి వేళ గమనించిన కొందరు మంగళవారం ఉదయం అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని భావించారు. కానీ, రాత్రి కాగానే వర్షం కురవడంతో అటవీ ప్రాంతంలో చెలరేగిన మంటలు ఆరిపోయాయి. దీంతో అడవికి ముప్పు తప్పింది. తెల్లవారే దాకా మంటలు అలాగే ఉంటే అటవీ ప్రాంతంలోని వన్యప్రాణులు, వృక్ష సంపదకు నష్టం వాటిల్లేదని అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు. అటవీ ప్రాంతాల్లో నిప్పు పెట్టడం లాంటి చర్యలు మానుకోవాలని సూచించారు. అడవిలో మంటలు వ్యాప్తి చెందితే ప్రకృతికి ఎంతో నష్టం వాటిల్లుతుందని డెప్యూటీ రేంజ్ అధికారి ప్రవీణ్‌నాయక్ తెలిపారు. నిప్పు పెట్టిన వ్యక్తుల సమాచారం తెలిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


