‘పది’ సన్నద్ధతపై అనాసక్తి..! | - | Sakshi
Sakshi News home page

‘పది’ సన్నద్ధతపై అనాసక్తి..!

Mar 25 2026 6:57 AM | Updated on Mar 25 2026 6:57 AM

విరామ తరగతులకు విద్యార్థుల హాజరు అంతంతే..! ఉపాధ్యాయులు ఫోన్‌ చేసినా స్పందన కరువు ఇళ్లకే పరిమితం అవుతున్న విద్యార్థులు తల్లిదండ్రులు చొరవ చూపితేనే మేలు

మంచిర్యాలఅర్బన్‌: పదో తరగతిలో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు విద్యాశాఖ నిర్వహిస్తున్న సన్నద్ధత తరగతుల(విరామ సమయంలో)పై విద్యార్థులు అనాసక్తి చూపిస్తున్నారు. పాఠశాలకు వచ్చే విద్యార్థుల సంఖ్య 40శాతానికి మించడం లేదు. తరగతులకు రావాలంటూ ఉపాధ్యాయులు పదే పదే ఫోన్‌ చేసినా స్పందన కరువవుతోంది. ఎండ వేడిమో.. ఏమో గానీ విద్యార్థులు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఇళ్లలో చదువుతున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారని ఉపాధ్యాయులు అంటున్నారు. పదో తరగతి వార్షిక పరీక్షల నేపథ్యంలో విద్యార్థులపై ఒత్తిడి తగ్గించడానికి సీబీఎస్‌ఈ తరహాలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎనిమిది పరీక్షలు 33రోజులపాటు జరుగుతున్నాయి. దీంతో ఒక్కో పేపర్‌కు మధ్య విరామం సమయంలో ప్రత్యేక తరగతుల్లో చదివిస్తామంటే విద్యార్థులు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. పరీక్ష లేని రోజుల్లో పిల్లలు ఆటల్లో మునిగి గాడితప్పుతారని భావించి నిరంతరం పునశ్చరణ, క్రమం తప్పకుండా మూల్యాంకనం చేయడం, సమాధాన రచన, నైపుణ్యాల బలోపేతంతోపాటు తప్పులు సరిదిద్దడం కోసం నిర్వహిస్తున్న తరగతులపై విద్యార్థులు, తల్లిదండ్రుల అనాసక్తితో మొక్కు‘బడి’గా మారుతోంది.

జిల్లాలో ఇలా..

జిల్లాలోని 296 సర్కారు పాఠశాలల్లో 6,296 మంది పదో తరగతి విద్యార్థులు ఉన్నారు. వీరిలో 2,977 మంది బాలురు, 3,319 మంది బాలికలు ఉన్నారు. ఇందులో కేజీబీవీ, గురుకులాలు మినహాయిస్తే మిగతా లోకల్‌బాడీ, ఎయిడెడ్‌, ప్రభుత్వ, మోడల్‌ స్కూళ్లలో విద్యార్థులు విరామ సమయంలో ఆశించిన మేర బడిబాట పట్టడం లేదు. ఇప్పటికే ఇంగ్లిషు పరీక్ష వరకు పూర్తయ్యాయి. ప్రత్యేక తరగతులపై మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ‘సాక్షి’ వివరాలు సేకరించింది. ఎనిమిది పాఠశాలల్లో 540 మందికి గాను 198మంది మాత్రమే హాజరయ్యారు. ఈ లెక్కన 33.67శాతం విద్యార్థులు వచ్చారు. చెన్నూర్‌ రోడ్‌ పాఠశాలలో అత్యధికంగా 58 మందికి గాను 43మంది హాజరు కాగా, అత్యల్పంగా గర్మిళ్ల ఉన్నత పాఠశాలలో 39 మందికి గాను నలుగురే హాజరయ్యారు. పట్టణ ప్రాంతంలోనే ఈ పరిస్థితి ఉంటే గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి. మిగతా పాఠశాలల్లో 20నుంచి 30శాతం దాటడం లేదేని తెలుస్తోంది.

ప్రత్యేక తరగతులతో సాధన

పరీక్షకు పరీక్షకు మధ్య విరామ రోజుల్లో విద్యార్థులు బడికి వస్తే సాధన చేసే వీలుంటుంది. ఇంటి వద్ద ఉంటే టీవీ, సెల్‌ఫోన్‌కు ఆకర్షితులై చదువులో వెనుకబడే అవకాశం ఉంటుంది. విద్యార్థులను ఉత్తీర్ణత సాధించే అవకాశం లేని వారు, సగ టు మార్కులు సాధించేవారు, ప్రతిభ చూపుతున్నవారు, వెనుకబడి ఉన్న విద్యార్థులుగా వర్గీకరించి సన్నద్ధతకు ప్రత్యేక వ్యూహాలు రూపొందించడంతోపాటు స్వీయ అధ్యయనం, అభ్యసనం, సందేహాల నివృత్తికి తోడ్పాటు అందిస్తారు. రో జుకు మూడు తరగతుల చొప్పున సాధన చే యించడానికి ప్రధానోపాధ్యాయులు చొరవ చూ పుతున్నారు. మొదటి పీరియడ్‌ రివిజన్‌, భానలపై అవగాహన కల్పించడం, విద్యార్థుల సందేహాల నివృత్తికి అవకాశం కలుగుతుంది. రెండో పీరియడ్‌లో ప్రతీ రోజు అభ్యసన పరీక్ష నిర్వహిస్తున్నారు. మూడో పీరియడ్‌లో సమాధానాలు రాయడానికి సరైన పద్ధతి, నిర్మాణం, ప్రదర్శన, నివారించాల్సిన సాధారణ తప్పులు, జవాబులు ఎలా రాస్తే ఎక్కువ మార్కులు సాధించవచ్చో అవగాహన కల్పించడంతో విద్యార్థులకు మేలు జరుగుతుంది. ఉపాధ్యాయులకు సహకరించి తల్లిదండ్రులు శ్రద్ధ చూపితేనే విద్యార్థులు బడిబాట పట్టే వీలుంటుంది.

జిల్లా కేంద్రంలోని పాఠశాలలు, విద్యార్థుల హాజరు

పాఠశాల విద్యార్థులు హాజరు

చెన్నూర్‌రోడ్‌ ప్రభుత్వ పాఠశాల 58 43

సినిమావాడ ప్రభుత్వ పాఠశాల 37 15

గర్మిళ్ల హైస్కూల్‌ 39 04

పాత మంచిర్యాల హైస్కూల్‌ 14 08

జెడ్పీహెచ్‌ఎస్‌(బాలికలు) 177 65

జెడ్పీహెచ్‌ఎస్‌(బాలురు) 77 09

కేజీబీవీ మంచిర్యాల 39 33

మోడల్‌స్కూల్‌ 99 21

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement