మంచిర్యాలఅర్బన్: పాఠశాల విద్య–ఉపాధ్యాయులు–రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి కేటాయింపులు 20శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తూ టీపీటీఎఫ్ ఆధ్వర్యంలోమంగళవారం కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పోడేటి సంజీవ్ మాట్లాడుతూ పీ ఆర్సీ ఫిట్‌మెంటు ప్రకటించాలని, బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని, రిటైర్డ్ టీచర్ల పెన్షనరీ ప్రయోజనాలను ఏకమొత్తంలో విడుదల చేయాలని డి మాండ్ చేశారు. సీపీఎస్ రద్దు చేయాలని, 2003 డీ ఎస్సీ టీచర్లకు పాత పింఛన్ వర్తింపజేయాలని పే ర్కొన్నారు. టీచర్ల పెండింగ్ బిల్లులు, డీఏలు విడుదల చేయాలని తెలిపారు. కేజీబీవీ, మోడల్‌స్కూల్, గిరిజన ఆశ్రమ, రెసిడెన్షియల్ స్కూల్ టీచర్లకు నగదు రహిత వైద్యసదుపాయం కల్పించాలని, కాంట్రాక్టు టీచర్ల వ్యవస్థ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టరేట్‌లో అందజేశారు. ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్ ప్రధాన కార్యదర్శి మనోజ్, ఉపాధ్యక్షులు గాజుల శంకర్, రజిత, జిల్లా బాధ్యుడు దేవ రమేష్, పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి శ్రీకాంత్, నాయకులు కార్తీక్, సికందర్ తదితరులు పాల్గొన్నారు.


