ఆటల్లో మెరికలు..! | - | Sakshi
Sakshi News home page

ఆటల్లో మెరికలు..!

Mar 24 2026 7:09 AM | Updated on Mar 24 2026 7:09 AM

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలువురు క్రీడాకారులు ఆటల్లో రాణిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అథ్లెటిక్స్‌, బాల్‌ బ్యాడ్మింటన్‌, వాలీబాల్‌, తైక్వాండో తదితర ఆటల్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ జిల్లాకు పేరు తీసుకొస్తున్నారు. జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో తమదైన ముద్ర వేస్తున్నారు. ఆర్థికంగా ఎన్ని కష్టాలు ఎదురైనా ఎదురొడ్డి పతకాలు సాధిస్తున్నారు. అలాంటి క్రీడాకారులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..

కోట్నాక్‌ జాకేష్‌ ఇప్పటి వరకు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ క్రీడా పోటీల్లో 25 సార్లు పాల్గొనగా 21 బంగారు పతకాలు, 4 రజత పతకాలు సాధించారు. జాతీయ స్థాయిలో మూడు సార్లు పాల్గొనగా 3 బంగారు పతకాలు సాధించారు.

2025 జనవరి 11 నుంచి 14 వరకు జార్కండ్‌ రాష్ట్రంలోని రాంచిలో 68వ నేషనల్‌ స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌జీఎఫ్‌ఐ) క్రీడల్లో అండర్‌ 14 విభాగంలో 600 మీటర్ల పరుగు పందెంలో ఉత్తమ ప్రదర్శన కనబర్చి మొదటి స్థానంలో నిలిచి బంగారు పతకం సాధించారు.

2025 అక్టోబర్‌ 10 నుంచి 14 తేదీలలో ఒడిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్‌లో జరిగిన 40వ జూనియర్‌ నేషనల్‌ చాంపియన్‌షిప్‌ క్రీడా పోటీల్లో ట్రయాథ్లాన్‌(ఏ) (హైజంప్‌, లాంగ్‌జంప్‌, 600 మీటర్ల పరుగుపందెం) విభాగంలో అత్యుత్తమ ప్రదర్శనతో బంగారు పతకం సాధించారు. జావెలిన్‌త్రోలో కాంస్యం పతకం సాధించారు. ఇక్కడ ట్రయాథ్లాన్‌ క్రీడల్లో జాతీయ రికార్డు సాధించారు.

2025 అక్టోబర్‌ 23 నుంచి 25 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో నిర్వహించిన 36వ సౌత్‌జోన్‌ జాతీయస్థాయి అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ క్రీడాపోటీల్లో జావెలిన్‌త్రో, హైజంప్‌, 400 మీటర్ల పరుగు పందెంలో బంగారు పతకం సాధించారు.

ఇటీవల హన్మకొండలో జరిగిన రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో 60 మీటర్లు, 600 మీటర్ల పరుగు పందెంలో మొదటి స్థానంలో నిలిచారు. ఈ నెల 28న హర్యానా రాష్ట్రంలో చండిగడ్‌లో నిర్వహించే జాతీయ స్థాయి స్కూల్‌ అథ్లెటిక్స్‌ క్రీడా పోటీలకు ఎంపికయ్యారు.

బజార్‌హత్నూర్‌: పేద కుటుంబ నేపథ్యం ఉన్న ఆదివాసీ గిరిజన బిడ్డ కోట్నాక్‌ జాకేష్‌ జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌ క్రీడల్లో రాణిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. జాకేష్‌ది ఆదిలాబాద్‌ జిల్లా బజార్‌హత్నూర్‌ మండలంలోని జాతర్ల గ్రామం. తండ్రి కొట్నాక్‌ జంగు ఆటో డ్రైవర్‌ కాగా, తల్లి రేణుక వ్యవసాయ కూలీ. జాకేష్‌ సొంత గ్రామంలోనే గిరిజన ఆదర్శ క్రీడల ఆశ్రమ పాఠశాల ఉంది. ఆదిలాబాద్‌ ఎంపీ గొడం నగేష్‌ తన స్వగ్రామం జాతర్లలో 2016లో కేంద్ర ప్రభుత్వ నిధులతో గిరిజన ఆదర్శ క్రీడల ఆశ్రమ పాఠశాలను ఏర్పాటు చేయించారు. దీంతో మారుమూల గిరిజన విద్యార్థులకు క్రీడల్లో రాణించేందుకు అవకాశం దక్కింది. స్థానికంగా ఉన్న క్రీడా పాఠశాలలో 9వ తరగతి చదువుతూ క్రీడా అవకాశాలను జాకేష్‌ సద్వినియోగం చేసుకున్నాడు. జాకేష్‌లో క్రీడా నైపుణ్యాన్ని గుర్తించిన కోచ్‌ సాహుల్‌ అతన్ని క్రీడల్లో శిక్షణ ఇచ్చి సానబెట్టారు.

మంచిర్యాలఅర్బన్‌: పాఠశాల స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు బాల్‌ బ్యాడ్మింటన్‌ పోటీల్లో ప్రతిభ కనబరిచి ఆదర్శంగా నిలుస్తోంది గోలేటికి చెందిన తిమ్మయ్య– స్వరూప దంపతుల కుమార్తె శ్రీవాణి. ఆమె మంచిర్యాల శ్రీహర్ష డిగ్రీ కళాశాలలో బీఎస్సీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతోంది. తండ్రి చిన్నప్పుడే మృతి చెందినా తల్లి వ్యవసాయ కూలీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. గోలేటి సింగరేణి పాఠశాలలో పరుగు పందెం, ఖోఖోలో శ్రీవాణి ఉత్తమ ప్రతిభ కనబర్చింది. ఆమె 9వ తరగతి చదువుతున్నప్పుడు ఆటల్లో ఆమె నైపుణ్యాన్ని గుర్తించిన అప్పటి వ్యాయామ ఉపాధ్యాయుడు బ్యాడ్మింటన్‌పై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. కొన్ని రోజుల్లోనే స్కూల్‌ గేమ్‌ ఫెడరేషన్‌, జిల్లా బ్యాడ్మింటన్‌ ఆసోసియేషన్‌ తరఫున జిల్లా నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రతిభ చాటింది.

కష్టాలు అధిగమిస్తూ..

సాధారణ కుటుంబం నుంచి వచ్చిన శ్రీవాణి డిగ్రీ చదువుతూనే పార్ట్‌టైంగా బ్యాంకులో పనిచేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలుస్తోంది. ఇప్పటి వరకు బాల్‌ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ నిర్వహించిన జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని మెమొంటోలతో పాటు ప్రశంసలు అందుకుంది. శ్రీవాణి ప్రతిభను గుర్తించి ఉమ్మడి ఆదిలాబాద్‌ బాల్‌బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ కార్యదర్శి తిరుపతి ప్రోత్సహించారు. గతేడాది డిసెంబర్‌లో నిర్వహించిన పోటీల్లో జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో మెరిసింది. నేషనల్‌ బాల్‌ బ్యాడ్మింటన్‌ ఫెడరేషన్‌, ఢిల్లీలో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లో నైపుణ్యత ప్రదర్శించి ఇంటర్నేషనల్‌ స్థాయికి ఎదిగింది. ఇండోనేషియాలో బాల్‌బ్యాడ్మింటన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆసియా ఆధ్వర్యంలో ఫిబ్రవరి 14 నుంచి 19వ వరకు నిర్వహించిన పోటీల్లో అత్యంత ప్రతిభ చూపి గోల్డ్‌ మెడల్‌ సాధించి దేశానికే వన్నె తెచ్చింది.

దేవల్ల శ్రీవాణి

ప్రభుత్వం సహకారం అందించాలి

కోచ్‌ సాహుల్‌ శిక్షణ, ప్రధానోపాధ్యాయులు కిషన్‌రెడ్డి, జిల్లా గిరిజన క్రీడల అధికారి పార్థసారథి, జిల్లా అథ్లెటిక్స్‌ కార్యదర్శి రాజేశ్‌, వార్డెన్‌ కృష్ణరావుల ప్రోత్సాహంతో క్రీడల్లో రాణిస్తున్నాను. తల్లిదండ్రుల ఆర్థిక కష్టాలు నన్ను మానసికంగా కుంగదీస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మా కుటుంబానికి ఆర్థిక భరోసా ఇవ్వాలి. అప్పుడు ఎలాంటి ఆటుపోటులు లేకుండా అంతర్జాతీయ స్థాయికి ఎదగడానికి పట్టుదలతో కృషి చేస్తా. – కోట్నాక్‌ జాకేష్‌, క్రీడాకారుడు

సాధించిన ఘనతలు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement