వేమనపల్లి: సారూ.. నేను సచ్చిపోయానట.. నాకు రైతు భరోసా సాయం అందడం లేదు.. అంటూ మండలంలోని దస్నాపూర్‌కు చెందిన తాల్లపల్లి పద్మ సోమవారం ప్రజావాణిలో ఎంపీడీవో కుమారస్వామి, ఎంఏవో వీరన్నకు వేర్వేరుగా ఫిర్యాదు చేసింది. వివరాలు ఆమె మాటల్లోనే.. పద్మకు దస్నాపూర్ శివారు సర్వేనంబర్ 98లో 25 గుంటల భూమి ఉంది. ఆరేళ్ల క్రితం ఆమె భర్త తిరుపతి గౌడ్ మృతి చెందడంతో ఈ భూమి ఆమె పేరు మీద విరాసత్ పట్టా అయ్యింది. అప్పటి నుంచి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, రైతుబంధు సాయం ఆమె ఖాతాలో పడుతున్నాయి. గతేడాది ఏప్రిల్ 11న ఆమె కుమారుడు రాకేష్ గౌడ్ తాటి చెట్టు పైనుంచి కిందపడి మృతి చెందాడు. అతని పేరుమీద పది గుంటలు పట్టా భూమి ఉంది. రైతుబీమా డబ్బుల మంజూరుకోసం ఏఈవో హెప్సిబాను సంప్రదించింది. మరణ ధ్రువీకరణపత్రం, ఇతర డాక్యుమెంట్‌లు అందజేసింది. అయితే సదరు ఏఈవో మా త్రం పద్మ చనిపోయినట్లు నమోదు చేసింది. దీంతో గతేడాది నుంచి రైతు భరోసా, కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు నిలిచిపోయాయి. ఈ విషయమై కలెక్టర్, ఏవో, ఏఈవో కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తోంది. సోమవారం ఏంఏవో వీరన్న రమ్మనడంతో పద్మ నీల్వాయి ఏఈవో కార్యాలయానికి వెళ్లగా ఆమె ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే వెళ్లిపోయిందని బాధితురాలు వాపోయింది.


