మంచిర్యాలటౌన్: మంచిర్యాల నగరానికి చెందిన రాము –జయంతి దంపతుల కూతురు అస్మిత తైక్వాండోలో రాణించి స్పోర్ట్స్ కోటాలో వరంగల్‌లోని ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో సీటు సంపాదించి బీటెక్ ఫస్టియర్ చదువుతోంది. చిన్ననాటి నుంచే క్రీడల్లో మక్కువ ఉన్న అస్మిత మూడేళ్లుగా తైక్వాండోలో రాణించి, జిల్లా, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొంది, జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించింది. స్కూల్ ఫెడరేషన్ గేమ్స్‌లో పసిడి పతకం, రాష్ట్రస్థాయిలో తైక్వాండో అసోసియేషన్ నిర్వహించిన పోటీల్లో రజత పతకం, జెఎన్‌టీయూహెచ్ ఎంపిక పోటీల్లో బంగారు పతకం సాధించి, తన సత్తా చాటుతోంది.
ఆసక్తితో పట్టు..
మంచిర్యాలకు చెందిన వెంకటేశ్ –లతల కుమార్తె కార్ల శ్రీజ తైక్వాండోపై ఉన్న ఆసక్తితో క్రీడలో పట్టు సాధించింది. మూడో తరగతిలో ఉండగానే శిక్షకుడు మండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో శిక్షణను ప్రారంభించి జిల్లా, రాష్ట్ర స్థాయిలో సత్తాను చాటి, జాతీయస్థాయి పోటీల్లోనూ పాల్గొంది. 2016లో జాతీయస్థాయిలో పాల్గొని తన ఆటతీరుతో ఆకట్టుకుంది. ఆ తరువాత కేరళలో నిర్వహించిన సౌత్‌జోన్ నేషనల్స్‌లో ఆడి మొదటిసారిగా బంగారు పతకాన్ని సాధించింది. ఎస్‌జీఎఫ్ పోటీల్లోనూ పాల్గొని రెండుసార్లు కాంస్య పతకాన్ని సాధించింది. స్పోర్ట్స్ కోటాలో కోటి ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ సీటు పొందింది.


