ఎండలు షురూ..
మంచిర్యాలఅగ్రికల్చర్: చలికాలం ముగిసింది. వేసవికాలం మొదలైంది. జిల్లాలో నాలుగు రోజులుగా ఎండలు మండుతున్నాయి. రాత్రి పూట చల్లని గా లులు వీస్తున్నా పగటిపూట ఎండలు ఎక్కువగానే ఉంటున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు 18 నుంచి 22 వరకు ఉంటుండగా. గరిష్ట ఉష్ణోగ్రతలు 34 నుంచి 37 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. శుక్రవారం కోటపల్లి మండలంలో 36.4, శనివారం లక్సెట్టిపేట, చె న్నూర్ మండలాల్లో 36.1, ఆదివారం జైపూర్ మండలంలో 36.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. వేసవి ప్రతాపం పెరుగుతుండడంతో మధ్యాహ్న సమయంలో జనాలు బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. దీంతో ప్రధాన చౌరస్తాలు బోసిపోతున్నాయి. ఇటు ఎండ వేడిమి, ఉక్కపోతతో ఇళ్లల్లో కూలర్లు, ఏసీల వాడకం మొదలైంది. యాసంగి సీజన్‌లో సాగు చేసిన పంటలకు నీరందించేందుకు బోర్లు, విద్యుత్ మోటర్ల వాడకం ఎక్కువైంది. గత జనవరి నుంచి విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. ఎక్కువగా రైతులు బోరుబావులపై ఆధారపడి పంటలు సాగు చేసుకున్నారు. ప్రస్తుతం వరి పంట ఎదిగే దశలో ఉంది. రెండు నెలల పాటు నీటితడులు ఎక్కువగా అందిస్తేనే పంట చేతికి వచ్చేది. జిల్లాలో మొత్తం 3,76,830 విద్యుత్ కనెక్షన్లు, 13,457 ట్రాన్స్‌ఫార్మర్లు ఉన్నాయి. విద్యుత్ వినియోగం పెరగడంతో ట్రాన్స్‌ఫార్మర్లపై భారం పడుతోంది. జిల్లాకు సరఫరా అవుతున్న విద్యుత్ కంటే అధికంగా వినియోగం పెరిగింది. ఇప్పుడే ఇలా ఉంటే రానున్న మూడు నెలల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరగనున్నాయి. దీంతో పాటు విద్యుత్ వినియోగం భారీ పెరిగే అవకాశం ఉంది.
విద్యుత్ మోటార్లతో నీటితడులు
జిల్లాలో ఈ ఏడాది యాసంగి సాగు విస్తీర్ణం పెరిగింది. గతేడాది 1.32 లక్షల ఎకరాలు ఉంటే ఈ ఏడాది 1,44,002 ఎకరాలకు చేరింది. ఇందులో ప్రధానంగా 1,18,846 ఎకరాల్లో వరి సాగు చేశారు. రైతులు ఎక్కువగా బోరుబావులు, కాల్వలు, గోదావరి నీటిపై ఆధారపడి సాగు చేసుకోగా విద్యుత్ మోటార్ల నీటితడులు అందిస్తున్నారు. 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా ఉండడతో వరిసాగుకే రైతులు ఎక్కువగా మొగ్గు చూపారు. నిరంతర విద్యుత్ సరఫరాతో నీటివృధా, కొన్నిచోట్ల విద్యుత్ వాడకం తగ్గించుకునేందుకు త్రీఫేజ్ విద్యుత్‌లో కోత పెడుతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. వానాకాలం సాగులో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల కారణంగా వరినాట్లు ఆలస్యం కావడంతో యాసంగి సీజన్‌లో వరి నాట్లు ఆలస్యమయ్యాయి. ప్రస్తుతం పంట ఎదిగే దశలో ఉంది. మరో రెండు నెలల పాటు నీటితడులు అందిస్తేనే పంట చేతికి అందివస్తుంది. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత కూడా అధికంగానే ఉంటుంది. విద్యుత్ వాడకం కూడా అధికంగానే ఉంటుంది. దీంతో ట్రాన్స్‌ఫార్మర్లపై అధికభారం పడనుంది.
జిల్లాలో ఐదు రోజులుగా
ఉష్ణోగ్రతల వివరాలు
తేదీ కనిష్ట గరిష్ట
25 18.0 33.6
26 18.6 34.2
27 19.2 36.4
28 21.2 36.1
01 23.1 36.1
నాలుగు నెలల్లో జిల్లాలో
విద్యుత్ వాడకం ఇలా
నెల వినియోగం (మి.యూలో)
నవంబర్ 56.642
డిసెంబర్ 67.063
జనవరి 74.797
ఫిబ్రవరి 80.014


