గోదావరి పుష్కరాలకు సన్నద్ధం కావాలి
చెన్నూర్: గోదావరి పుష్కరాలకు అన్ని ప్రభుత్వ శాఖలు సన్నద్ధం కావాలని జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం పోలీసు, మున్సిపల్, దేవాదాయ, పంచాయతీరాజ్, ఫారెస్ట్, ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి చెన్నూర్ గోదావరినది పరిసరాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ 2015లో జరిగిన పుష్కరాల్లో రోజుకు 20 నుంచి 30 వేల మంది పుణ్యస్నానం ఆచరించారన్నారు. జాతీయ రహదారి కనెక్టివిటీ ఉండడంతో 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరిగే పుష్కరాలకు రోజుకు సుమారు 50 వేల నుంచి లక్ష మంది భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసేందుకు అవసరమైన నిధుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తే కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ పెద్దింటి పద్మ శ్రీనివాస్, సీఐలు బన్సీలాల్, కృష్ణ, కమిషనర్ మురళీకృష్ణ, శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఉదయ్‌కుమార్, ఈవో రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.


