ఇరాన్‌పై దాడులను ఖండించాలి
పాతమంచిర్యాల: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ దాడులను నిరసిస్తూ సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఎదుట అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి అజ్మీర లాల్‌కుమార్ మాట్లాడుతూ ఒక దేశ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకునే అధికారం మరో దేశానికి లేదన్నారు. ట్రంప్ ప్రభుత్వం ఇతర దేశాలపై దాడులు చేసే దురాక్రమణ విధానాలు అనుసరిస్తూ ఆ దేశాల సార్వభౌమాధికారాన్ని హరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి శ్రీనివాస్, అరుణోదయ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లన్న, పీవోడబ్ల్యూ అధ్యక్షురాలు జ్యోతి, కార్యదర్శి అరుణ, పీడీఎస్‌యూ జిల్లా ఉపాధ్యక్షుడు కార్తీక్, తదితరులు పాల్గొన్నారు.


