భార్యాభర్తల ప్రాణాలు బలిగొన్న అతివేగం
బెల్లంపల్లి: సిద్దిపేట జిల్లా కొండపాక శివారు రాజీవ్ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బెల్లంపల్లికి చెందిన భార్యాభర్తలు మృతి చెందారు. కారు, టాటా ఏస్ ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో కారు డ్రైవింగ్ చేస్తున్న సింగరేణి కార్మికుడు మహ్మద్ అబ్దుల్ రఫీ (50) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందగా, వెనుకసీట్లో కూర్చున్న అతడి భార్య ఫర్జానా ఫర్జానా (47) తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను అంబులెన్స్‌లో సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందింది. టాటా ఏస్ అతివేగంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బెల్లంపల్లి ఏరియా కై రిగూడ ఓపెన్‌కాస్ట్ గనిలో రఫీ జనరల్ అసిస్టెంట్‌గా పని చేస్తుండగా ఫర్జానా గృహిణి. వీరికి కొడుకులు నియాజ్, సోను, కూతురు నదియా ఉన్నారు. భార్యాభర్తల మృతితో రఫీ నివాసముంటున్న బెల్లంపల్లి పోస్టాఫీస్ బస్తీ దుఃఖసాగరంలో మునిగింది. బస్తీ వాసులందరితో ఎంతో కలివిడిగా ఉండే రఫీ, ఫర్జానా తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో బంధువులు, స్నేహితులు, బస్తీ వాసులు కన్నీరుమున్నీరయ్యారు.
పేరెంట్స్ కమిటీ మీటింగ్‌కు వెళ్లి వస్తుండగా..
హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో రఫీ పెద్ద కొడుకు నియాజ్ బీటెక్ చదువుతున్నాడు. శనివారం పేరెంట్స్ కమిటీ మీటింగ్ ఉండటంతో భార్యాభర్తలు కారులో హైదరాబాద్‌కు వెళ్లారు. మీటింగ్‌కు హాజరై తిరిగి బెల్లంపల్లికి వస్తుండగా ఈ ఘటన జరిగింది.
రొట్టెలు చేసి ఎదురుచూసిన తల్లి
సింగరేణిలో కార్మికుడిగా పని చేసిన సుకుర్‌మియా 20 ఏళ్ల క్రితం మెడికల్ అన్‌ఫిట్ అయి ఏకై క కొడుకై న రఫీకి కంపెనీలో ఉద్యోగం పెట్టించాడు. కొడుకు, కోడలు మనవడి దగ్గరకు వెళ్లి ఇంటికి ఆకలితో తిరిగి వస్తారనుకుని రఫీ తల్లి షాజాతిభీ గోధుమ రొట్టెలు చేసి వారి రాక కోసం ఎదురుచూసింది. వృద్ధాప్యం పైబడి అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమెకు కొడుకు, కోడలు మరణవార్త తెలియకుండా బంధువులు, బస్తీవాసులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ తల్లి కొడుకు, కోడలు రాక కోసం ఎదురుచూస్తున్న తీరు బస్తీవాసులు, బంధువులను కంటతడి పెట్టించింది.
సిద్దిపేటకు వెళ్లిన బంధువులు
రఫీ, ఫర్జానా మృతి వార్త తెలియగానే బంధువులు, బస్తీవాసులు ప్రత్యేక వాహనాల్లో సిద్దిపేటకు వెళ్లారు. తొలుత రోడ్డు ప్రమాదంలో రఫీ మాత్రమే చనిపోయాడని, తీవ్ర గాయాలతో ఫర్జానా సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం వచ్చింది. కారులో హుటాహుటిన సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి చేరుకోగా కొద్ది నిమిషాల తేడాతో ఫర్జానా కూడా మృతి చెందినట్లు వైద్యులు చెప్పడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. అక్కడ ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహాలకు ఆదివారం పోస్టుమార్టం నిర్వహించాక బెల్లంపల్లికి తీసుకురానున్నట్లు మృతుల సన్నిహితులు తెలిపారు.
భార్యాభర్తల ప్రాణాలు బలిగొన్న అతివేగం


