వరుస చోరీలు చేస్తున్న దొంగలు రిమాండ్
ఖానాపూర్: గత కొన్ని నెలలుగా ఆలయాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న నిందితులను పట్టుకున్నట్లు నిర్మల్ ఏఎస్పీ సాయికిరణ్ తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చోరీ కేసు వివరాలు వెల్లడించారు. గత కొన్ని రోజులుగా నిర్మల్ డివిజన్‌లోని ఖానాపూర్, లక్ష్మణ్‌చాంద, నిర్మల్ టౌన్, మామడ తదితర మండలాల్లోని ఆలయాలను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను పట్టుకున్నట్లు తెలిపారు. ఖానాపూర్ మండలం సేవ్యానాయక్ తండాలోని జగదాంబ ఆలయంలో దొంగతనానికి పాల్పడిన నలుగురు వ్యక్తులను శుక్రవారం సత్తనపెల్లి గ్రామశివారులో పట్టుకున్నామని, గురువారం సైతం మరో ఇద్దరు నిందితులను పట్టుకుని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. రెండు రోజుల వ్యవధిలో పోలీసులకు పట్టుబడిన నిందితులు ఒకే ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడే వారని పేర్కొన్నారు. ఆలయాల్లో చోరీలకు పాల్పడిన నిందితులు గాదె రమేశ్, దొసండ్ల శ్రీనివాస్, గురిజాల నడ్చి నర్సయ్య, బూట శంకర్, చీమల శ్రీకాంత్, బుర్క లక్ష్మణ్ అనే ఆరుగురు వ్యక్తులు కలిసి ఖానాపూర్ మండలంలోని తర్లపాద్ గ్రామంలో గల ఓంకారేశ్వర ఆలయం, అగ్గిమల్లన్న ఆలయం, మస్కాపూర్‌లోని శివాలయం, మధురనగర్‌లోని ఉగ్రనరసింహ స్వామి ఆలయం, ఖానాపూర్ పట్టణంలోని సాయిబాబా ఆలయం, వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయాలతో పాటు ఇతర మండలాల్లోని ఆలయాల్లో చోరీలు చేశారన్నారు. నిర్మల్ జిల్లాలోని పలు ఆలయాల్లో ముఠాగా ఏర్పడిన వీరు ఆలయాల్లోని దేవునిపై ఉండే ఆభరణాలతో పాటు హుండీలో నగదును చోరీ చేశారన్నారు. కార్యక్రమంలో ఖానాపూర్ సీఐ అజయ్, నిర్మల్ పట్టణ సీఐ నైలు, ఖానాపూర్ ఎస్సై రాహూల్ గైక్వాడ్, సిబ్బంది తదితరులు ఉన్నారు.


