మహిళల ఆర్థికాభివృద్ధికి ‘లఖ్‌పతి దీదీ’
పాతమంచిర్యాల: స్వయం సహాయక సంఘాల మహిళలను లక్షాధికారులను చేయడమే లక్ష్యంగా లఖ్‌పతి దీదీ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా మహిళా సంఘాల సభ్యులకు వడ్డీలేని రుణాలు, సీ్త్రనిధి, బ్యాంకు లింకేజీ ద్వారా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ రుణ సౌకర్యం కల్పిస్తోంది. రుణాలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా పురోభివృద్ధి సాధించడానికి అధికారులు సలహాలు, సూచనలు అందజేస్తున్నారు. పండించిన పంటల అమ్మకాలపై వచ్చిన ఆదాయం, రుణం తీసుకుని నెలకొల్పిన యూనిట్లపై వచ్చిన ఆదాయాన్ని మూడు నెలలకోసారి లెక్కిస్తారు. ఏడాదిలో మూడు సార్లు సభ్యుల ఆదాయ వివరాలను గ్రామ సంఘం సహాయకులు(వీవోఏ) లెక్కించి డిజిటల్ లఖ్‌పతి దీదీ అజివిక రిజిష్టర్‌లో నమోదు చేస్తారు. సంవత్సర కాలంలో సభ్యురాలు రూ.లక్ష కంటే తక్కువ ఆదాయం పొందుతున్నట్లు తేలితే ఆమెకు మరింత రుణ సౌకర్యం కల్పించి లక్ష్యం చేరుకునేలా డీఆర్‌డీఏ అధికారులు చేయూతనందిస్తారు. ఈ కార్యక్రమం నిర్వహణ కోసం జిల్లాలోని 16 మండలాల్లోని 459 మంది గ్రామ సంఘాల సహాయకులకు(వీవోఏ) ఈ నెల 20 నుంచి 28వరకు ప్రత్యేక శిక్షణ మండల సమాఖ్య కార్యాలయాల్లో మాస్టర్ ట్రైనర్లు అందిస్తున్నారు. ఇప్పటికే చెన్నూర్, కాసిపేట, లక్సెట్టిపేట, తాండూర్, వేమనపల్లి, హాజీపూర్, జైపూర్, జన్నారం, కోటపల్లిలో నిర్వహించగా.. 27, 28న బెల్లంపల్లి, భీమారం, భీమిని, మందమర్రి, నెన్నెల మండలాలలో నిర్వహించనున్నారు. మహిళలు రుణాలను వినియోగించుకుని లక్షాధికారిగా ఎదగడమే లఖ్‌పతి దీదీ పథకం ఉద్దేశమని డీఆర్డీవో ఎస్.కిషన్ తెలిపారు.


