సరస్వతీదేవి ఆలయానికి పోటెత్తిన భక్తులు
బాసర: బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో గురువారం భక్తుల రద్దీ నెలకొంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ముందుగా పవిత్ర గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు చేసి అమ్మవారి దర్శనానికి క్యూలైన్లలో బారులుదీరారు. తల్లిదండ్రులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసం, కుంకుమార్చన పూజలు చేయించారు. సీఐ కిరణ్, ఎస్సై నవనీత్ రెడ్డి, ఆలయ ఈవో విజయ రామారావు, ఏఈఓ గంగా శ్రీనివాస్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కాగా ఆలయానికి గురువారం అన్ని మార్గాల ద్వారా మొత్తం రూ.8,30,880 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో విజయరామారావు వెల్లడించారు.


