గోల్డ్ కొట్టేసి.. గోవా తిరిగొచ్చాడు..
మందమర్రిరూరల్: మందమర్రి పట్టణంలోని ఓ యువకుడు మద్యానికి బానిసై.. జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేశాడు. దోచుకున్న సొమ్ముతో జల్సా కోసం గోవాకు వెళ్లాడు. నగదు ఖర్చయ్యాక.. దోచుకున్న బంగారాన్ని అమ్మేసి నగదు చేసుకోవడానికి మందమర్రికి రావడంతో పోలీసులు పక్కా ప్రణాళికతో వలపన్ని పట్టుకున్నారు. గురువారం మందమర్రి పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై నరేష్ వివరాలు వెల్లడించారు. మందమర్రి పట్టణంలోని యాపల్ ప్రాంతానికి చెందిన జాడి అభిరామ్ కూలీ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. మద్యపానం, విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డాడు. అలవాట్లకు తగ్గట్లు డబ్బు లేకపోవడంతో దొంగతనాలు చేయడం మొదలు పెట్టాడు. జనవరి 30న అతడి ఇంటి పక్కన సెగ్యం మధు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో బీరువాలోని 12.5 గ్రాముల బంగారం, నగలు దొంగిలించాడు. దుర్గం నాగలక్ష్మీ ఇంట్లో ఎనిమిది గ్రాముల బంగారం చోరీ చేశాడు. రూ.25 వేలతో నేరుగా గోవాకు వెళ్లి జల్సా చేశాడు. డబ్బు అయిపోవడంతో తన వద్ద ఉన్న బంగారం అమ్మాలనే ఆలోచనతో గోవా నుంచి మందమర్రికి వచ్చాడు. సాంకేతిక ఆధారాలతో అతడిపై నిఘా ఉంచిన పోలీసులు గురువారం స్థానిక సీఈఆర్ క్లబ్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 14.4 గ్రాముల బంగారం, 14 తులాల వెండి పట్టీలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.


