పంట నష్టపరిహారం అందించాలని రైతుల ధర్నా
భైంసారూరల్: అకాల వర్షాలతో పంటలు దె బ్బతిన్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని మండలంలోని దేగాం గ్రామానికి చెందిన రైతులు ఆందోళన చేపట్టారు. గురువారం భైంసా –బాసర జాతీయ రహదారిపై దేగాం గ్రామంలో ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఇటీవల కురిసిన ఈదురుగాలులతో కూడిన వర్షాలకు శెనగ, మొక్కజొన్న తదితర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కోత దశలో ఉన్న శెనగ పంట నేలకూలి తడిసిపోయిందని వాపోయారు. ప్రభుత్వం వెంటనే గ్రామ స్థా యిలో పంట నష్టాన్ని అంచనా వేసి పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్, ఏవో గణేశ్, ఎస్సై సుప్రియలు అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.
నకిలీ నోటుపై విచారణ
లక్సెట్టిపేట: మండల కేంద్రంలోని సూపర్ మార్కెట్‌లో లభ్యమైన రూ.500 ఫేక్ నోట్‌పై స్థానిక ఎస్సై గోపతి సురేశ్, పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈనెల 25వ తేదీన సాక్షి దినపత్రికలో రూ.500 ఫేక్ నోట్ లభ్యం శీర్షికన ప్రచురితమైన వార్తకు పోలీసులు స్పందించి గురువారం ఉదయం సూపర్‌మార్కెట్‌లో సిబ్బందితో మాట్లాడారు. ఫిర్యాదు తీసుకుని వివరాలను సేకరించినట్లు తెలిపారు. పట్టణంలోని పలువురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఫేక్ నోట్‌ల చలామణి ఎలా జరుగుతుంది.. ఎక్కడి నుంచి వచ్చాయనే కోణంలో విచారణ జరుగుతుందని ఎస్సై పేర్కొన్నారు.


