ఆర్జీయూకేటీ విద్యార్థుల ప్రతిభ
బాసర: ఈ నెల 21న హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో రాధా టీఎంటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సాంకేతిక పోటీ ‘రేపటి సృష్టికర్తలు బిల్డాథాన్’లో బాసరలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం విద్యార్థులు సత్తా చాటారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు వంద ఇంజినీరింగ్ కళాశాలలు పాల్గొన్న ఈ పోటీల్లో ఆర్జీయూకేటీ ‘హరిత్వాస్తు’ బృందం రన్నరప్‌గా నిలిచి రూ.లక్ష నగదు బహుమతి గెలుచుకున్నారు. ‘పచ్చటి భవిష్యత్ కోసం హరిత స్థిరమైన నిర్మాణం’ అనే వినూత్న అంశంపై ప్రదర్శించిన ప్రాజెక్టు న్యాయనిర్ణేతల ప్రశంసలు అందుకుంది. పర్యావరణానికి హాని కలుగని నిర్మాణ పద్ధతులు, సహజ వనరుల వినియోగం అంశాలపై రూపొందించారు. బృంద సభ్యులు తాతారి సుమ, సధాగని కావ్య, కెట్టా కుసుమ, లింగుల్ శ్రుతి, చేతశ్రీ రాఘవను వీసీ ప్రొఫెసర్ ఏ.గోవర్ధన్, ఓఎస్‌డీఈ మురళిదర్శన్ అభినందించారు. కార్యక్రమంలో డాక్టర్ ఎస్.రణధీర్, ల్యాబ్ ఫ్యాకల్టీ బాల భాస్కర్ పాల్గొన్నారు.


