చేపల వేటకు వెళ్లి ఒకరు మృతి
భైంసారూరల్: మండలంలోని కుంబి గ్రామానికి చెందిన బింగిలివార్ సాయినాథ్(60) అనే మత్స్యకారుడు చేపల వేటకు వెళ్లి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ఎస్సై సుప్రియ, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బింగిలివార్ సాయినాథ్ ఎప్పటిలాగే మంగళవారం గ్రామ సమీపంలోని సుద్దవాగుకు చేపలు పట్టేందుకు వెళ్లాడు. రాత్రి వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు, గ్రామస్తులు పరిసర ప్రాంతాల్లో గాలించారు. ఆచూకీ లభించలేదు. బుధవారం ఉదయం స్థానికులకు గ్రామ సమీపంలో సుద్దవాగు బ్యాక్ వాటర్‌లో శవమై కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా ప్రమాదవశాత్తు వలలో చిక్కుకుని మృతి చెందినట్లు గుర్తించారు. స్థానికుల సహాయంతో మృతదేహాన్ని తీసి భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబీకులకు అప్పగించారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమారుడు జైరాం ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వెల్లడించారు.
పెళ్లికి వచ్చి.. పరలోకాలకు!
భైంసాటౌన్: పట్టణంలో ఓ వివాహ కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్తున్న క్రమంలో లారీ ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. భైంసా మండలం బిజ్జూర్ గ్రామానికి చెందిన కల్యాణ్‌కర్ శివాజీ(53) ఆయన భార్య అనూషబాయితో కలిసి పట్టణంలోని రాహుల్‌నగర్‌లోగల ఓ ఫంక్షన్ హాల్‌లో వివాహానికి బైక్‌పై వచ్చారు. తిరిగి వెళ్లే క్రమంలో రాహుల్‌నగర్ వైపు నుంచి నిర్మల్ చౌరస్తా వద్దకు చేరుకోగానే, నిర్మల్ వైపు నుంచి వచ్చిన లారీ ఢీకొంది. ఈ ఘటనలో దంపతులకు తీవ్ర గాయాలు కాగా స్థానికులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శివాజీ మృతి చెందగా అనూషబాయి చికిత్స పొందుతోంది. శివాజీ మృతదేహాన్ని ఏరియాస్పత్రికి తరలించామని, లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ సాయికుమార్ వెల్లడించారు.
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
రామకృష్ణాపూర్: పట్టణంలోని భగత్‌సింగ్‌నగర్ ఏరియాలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం చెందింది. పట్టణ ఎస్సై శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం మందమర్రి 2వ జోన్‌కు చెందిన చంటి మల్లీశ్వరి(39) ద్విచక్ర వాహనంపై వెనుక కూర్చుని చెక్‌పోస్ట్ నుంచి బీజోన్ వైపు వస్తుండగా భగత్‌సింగ్‌నగర్ ప్రాంతంలో రోడ్డు పైకి వచ్చిన రెండు పశువులు పోట్లాడుకుంటూ ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్నాయి. దీంతో మల్లీశ్వరీ కిందపడిపోయింది. అదే సమయంలో ఎదురుగా మట్టిలోడ్‌తో వస్తున్న ట్రాక్టర్ టైరు ఆమె తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందింది. కాగా రాత్రి పూట అక్రమంగా మట్టిని తరలిస్తూ అధిక స్పీడ్‌తో ట్రాక్టర్ నడిపిన కారణంగానే మహిళ మృతిచెందిందని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆయా పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
తీసుకున్న అప్పు చెల్లించాలని తీర్పు
మంచిర్యాలక్రైం: అప్పుగా తీసుకున్న డబ్బులు వడ్డీతో సహా చెల్లించాలని మంచిర్యాల జ్యూడిషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్, జూనియర్ సివిల్ జడ్జి కే. నిరోష బుధవారం తీర్పునిచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే జైపూర్ మండలం రామరావుపేటకు చెందిన తెగుల్ల నరసింహరెడ్డి వద్ద మంచిర్యాలకు చెందిన మధుసూధన్ రూ.7లక్షల75వేలు అప్పుగా తీసుకున్నారు. తీసుకున్న అప్పును చెల్లించక పోవడంతో మధుసూధన్ ఇచ్చిన చెక్కులను బ్యాంకులో డిపాజిట్ చేయగా అవి చెక్‌బౌన్స్ అయ్యాయి. దీంతో నరసింహరెడ్డి 2018లో కోర్టును ఆశ్రయించడంతో మధుసూధన్‌పై చెక్‌బౌన్స్ కేసు నమోదైంది. కోర్టు విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో నరసింహరెడ్డి వద్ద మధుసూధన్ అప్పుగా తీసుకున్న రూ.7లక్షల 75వేలు చెల్లించాలని తీర్పునిచ్చారు.
చేపల వేటకు వెళ్లి ఒకరు మృతి
చేపల వేటకు వెళ్లి ఒకరు మృతి


