గడువులోగా లక్ష్యాలు పూర్తి చేయాలి
కై లాస్‌నగర్: బ్యాంకింగ్ లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్, పీఐసీ చైర్మన్ రాజర్షిషా అన్నారు. జిల్లా కేంద్రంలోని డీసీసీబీ బ్యాంక్ సమావేశ మందిరంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యాంక్ మేనేజర్లు, నోడల్ అధికారులతో బుధవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపునకు వస్తున్న తరుణంలో బ్యాంక్ కార్యకలాపాలను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మార్చి నెలాఖరు నాటికి బ్యాంకింగ్ లక్ష్యాలను వంద శాతం పూర్తి చేయాలన్నారు. బ్యాంకు మొండి బకాయిల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలోని మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల పరిధిలోని బ్యాంక్ మేనేజర్లు తమకు కేటాయించిన లక్ష్యాలను సాధించేందుకు ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. సమావేశంలో బ్యాంకు సీఈఓ రవి, జనరల్ మేనేజర్ సూర్యప్రకాశ్, సింహాచలం పాల్గొన్నారు.


