‘పది’ంతల మేలు..!
విరామంలోనూ ప్రత్యేక తరగతులు
ఒత్తిడి తగ్గించేందుకు సీబీఎస్‌ఈ
తరహాలో పరీక్షలు
ప్రీఫైనల్, వార్షిక పరీక్షల సన్నద్ధతపై మార్గదర్శకాలు
మంచిర్యాలఅర్బన్: పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఎన్నడూ లేని విధంగా విద్యార్థులపై ఒత్తిడి తగ్గించడానికి సీబీఎస్‌ఈ తరహాలో పరీక్షలు నిర్వహిస్తోంది. ఒక్కో పేపర్‌కు మధ్య విరామం ఇస్తూ కార్యాచరణ సిద్ధం చేసింది. మార్చి 14నుంచి ఏప్రిల్ 13వరకు పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్ష లేని రోజుల్లో విద్యార్థులు ఆటల్లో మునిగి గాడి తప్పుతారని భావించి నిరంతర పునర్విమర్శ, క్రమం తప్పకుండా మూల్యాంకనం చేయడం, సమాధాన రచన నైపుణ్యాల బలోపేతంతోపాటు తప్పులు తిద్దుతూ పరీక్షలపై విశ్వాసం, పనితీరును పెంపొందించడం లక్ష్యంగా మార్గదర్శకాలు జారీ అయ్యాయి.
నేటితో ముగియనున్న ప్రీఫైనల్
పది వార్షిక పరీక్షలు సమీపిస్తున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రీఫైనల్ పరీక్షలు నేటితో ముగియనున్నాయి. సమాధాన పత్రాలపై ఉపాధ్యాయులు సబ్జెక్టుల వారీగా ప్రతీ విద్యార్థితో చర్చించాలని మార్గదర్శకాల్లో సూచించారు. ప్రీఫైనల్ పరీక్ష ఆధారంగా విద్యార్థులను వర్గీకరిస్తారు. ఉత్తీర్ణత సాధించే అవకాశం లేనివారు, సగటు మార్కులు సాధించేవారు, ప్రతిభ చూపుతున్నవారు, వెనుకబడి ఉన్న విద్యార్థులను సన్నద్ధతకు ప్రత్యేక వ్యూహాలు రూపొందించడంతోపాటు స్వీయ అధ్యయనం, అభ్యసనం, సందేహాల నివృత్తికి తోడ్పాటు అందించాల్సి ఉంటుంది. మిగిలిన సమయాన్ని సద్వినియోగం చేసుకుని శతశాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలో ఉపాధ్యాయులు ప్రణాళిక తయారు చేసుకోవాలని విద్యాశాఖ నుంచి ఆదేశాలు వచ్చాయి.
విరామంలో ఇలా..
పదో తరగతి పరీక్షల్లో ఒక్కో పేపర్ మధ్య విరామాన్ని సద్వినియోగానికి సూచనాత్మక కార్యాచరణ తయారు చేసుకోవాలని మార్గనిర్దేశనం చేశారు. విరామ రోజుల్లో విద్యా షెడ్యూల్ విడుదల చేసింది. పరీక్ష లేని రోజుల్లో విద్యార్థి పాఠశాలకు వచ్చేలా చూడాల్సి ఉంటుంది. రోజుకు మూడు తరగతుల చొప్పున సాధనకు హెచ్‌ఎంలు చొరవ చూపాలి. మొదటి పీరియడ్ రివిజన్, భావనలపై అవగాహన కల్పించడం, విద్యార్థుల సందేహాలు నివృత్తి చేస్తారు. రెండో పీరియడ్‌లో ప్రతీ రోజు అభ్యాసన పరీక్ష నిర్వహించడం, పరీక్షల్లో ఐదు నుంచి ఆరు ప్రశ్నలు ఉండేలా చూడాల్సి ఉంటుంది. మూడో పీరియడ్‌లో సమాధానాలు రాయడానికి సరైన పద్ధతి, నిర్మాణం, ప్రదర్శన, ప్రతీ ప్రశ్నకు కవర్ చేయాల్సిన అంశాలు, నివారించాల్సిన సాధారణ తప్పులు, జవాబులు ఎలా రాస్తే ఎక్కువ మార్కులు సాధించవచ్చో విద్యార్థులు అవగాహన కల్పించాలి.
ఎంతో ఉపయోగం..
ప్రతీ సబ్జెక్టుకు పరీక్ష విరామ రోజుల్లో విద్యార్థులు పాఠశాలకు వస్తే ప్రయోజనం కలుగనుంది. ఇంటి వద్ద ఉంటే సెల్‌ఫోన్, టీవీ వీక్షించడం, ఆటల్లో మునిగి తేలడం వల్ల సబ్జెక్టుపై పట్టు కోల్పోయే వీలుంది. విద్యార్థులు పాఠశాల బాట పట్టాలంటే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమష్టి కృషి అవసరం.
పదో తరగతి రాసే సర్కారు పాఠశాలల విద్యార్థులు..
పాఠశాలలు సంఖ్య బాలురు బాలికలు మొత్తం
ప్రభుత్వపాఠశాలు 07 166 88 254
లోకల్‌బాడీ 101 1617 1424 3041
ఎయిడెడ్ 02 50 25 75
కేజీబీవీ 18 0 733 733
టీఎస్‌ఎంఎస్ 05 238 203 441
ఎంజేపీటీబీసీ
డబ్ల్యూఆర్‌ఈఐ 08 234 277 511
టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ 09 350 297 647
టీఎంఆర్‌ఎస్ 03 43 83 126
టీఎస్‌ఆర్‌ఎస్ 01 52 0 52
జీఏహెచ్‌ఎస్ 13 227 189 146
మొత్తం 296 2977 3319 6296


