బదిలీలకు రంగం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

బదిలీలకు రంగం సిద్ధం

Feb 24 2026 7:34 AM | Updated on Feb 24 2026 7:34 AM

బదిలీలకు రంగం సిద్ధం

బదిలీలకు రంగం సిద్ధం

● జిల్లాలో అధికారులకు స్థాన చలనం ● నచ్చిన చోట్ల పోస్టింగ్‌ కోసం పైరవీలు

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అధికారుల బదిలీలకు రంగం సిద్ధమైంది. పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల తర్వాత మరోసారి జిల్లాలో పలు స్థాయిల్లోని అధికారులకు స్థాన చలనం కలుగనుంది. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. గత జనవరిలో మున్సిపల్‌ ఎన్నికలకు ముందు కమిషనర్లు బదిలీ అయ్యారు. వీరిలో జిల్లా కేంద్రం మంచిర్యాల నగర కార్పొరేషన్‌తో సహా బెల్లంపల్లి, చెన్నూరు, క్యాతనపల్లి, లక్సెట్టిపేట మున్సిపాలిటీల కమిషనర్లు ఉన్నారు. తాజాగా మరోసారి బదిలీ జరిగే అవకాశాలున్నాయి. దీంతో కొన్ని మున్సిపాల్టీలకు బదిలీపై వెళ్లిన అధికారులే మళ్లీ వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రెవెన్యూ శాఖలో ఆయా మండలాల్లో ఉన్న తహసీల్దార్లలోనూ తమ స్థానాల నుంచి కదలిక రానుంది. కొందరు మరోచోటుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసు శాఖలోనూ ఎస్సై నుంచి సీఐ వరకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. రామగుండం కమిషనరేట్‌ పరిధిలోనూ మంచిర్యాల జోన్‌లో ఉన్న జిల్లా ఉన్నత స్థాయి, డివిజన్‌లోనూ బదిలీలు జరగనున్నాయి. ఎన్నికల ముందు కొందరికి స్థాన చలనం కలిగింది. మరికొందరి బదిలీకి కసరత్తు జరుగుతోంది. ఇక మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికల ముందు ఉత్వర్వులు వెలువడనున్నాయి. మండల, డివిజన్‌ నుంచి జిల్లా స్థాయి వరకు బదిలీలు జరిగే అవకాశం ఉన్నాయి.

జిల్లా ఉన్నతాధికారులకు?

రాష్ట్ర వ్యాప్తంగా పరిపాలన బదిలీల్లో భాగంగా జిల్లా ఉన్నతాధికారులకు స్థాన చలనం కలిగే అవకాశం ఉంది. రెవెన్యూ పరిధి ఉన్నతాధికారులకు జిల్లా నుంచి ఇతర జిల్లాలకు బదిలీ జరిగే అవకాశం ఉంది. మరోవైపు పౌరసరఫరాల శాఖలోనూ జిల్లా ఉన్నతాధికారులకు స్థాన చలనం కలుగనుంది. ఈ శాఖలో రాష్ట్ర వ్యాప్తంగా బదిలీలు జరిగే అవకాశం ఉంది. ఇక జిల్లాలోని పలు శాఖ అధికారులకు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంది. దీంతో ఇప్పటికే అధికారులు నచ్చిన చోట పోస్టింగ్‌ కోసం రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారుల కార్యాలయాల చుట్టూ పైరవీలు చేస్తున్నారు. ఇక జిల్లాకు వచ్చే అధికారులు సైతం ఆయా నియోజకవర్గ ప్రతినిధుల సిఫారసులతో ఆయా మున్సిపాలిటీలు, మండలాల్లో విధుల్లో చేరేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికల షెడ్యూల్‌ వస్తే ఆ మేరకు ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఉద్యోగుల బదిలీలు జరగనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement