అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
కాసిపేట: మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో కొత్తూరు నాని(47) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు దేవాపూర్ ఎస్సై గంగారాం తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. కన్నెపల్లి మండలం జన్కాపూర్ గ్రామానికి చెందిన నానికి 28 ఏళ్ల క్రితం పద్మతో వివాహం జరిగింది. వారికి కొడుకు, నలుగురు కూతుళ్లు ఉన్నారు. అతని భార్య నాలుగు నెలల క్రితం కుటుంబ కలహాలతో అతడిని వదిలిపెట్టి తమ్ముడి దగ్గర జన్కాపూర్‌లో కూలి పని చేస్తూ జీవిస్తుంది. భార్య, పిల్లలను చూసేందుకు వచ్చిన నాని గ్రామంలోనే అతిగా మద్యం సేవించాడు. తెలిసిన వారు తీసుకొచ్చి ఇంటి ముందు పడుకోబెట్టి వెళ్లారు. ఆదివారం మధ్యాహ్నం సమయంలో నాని కూతురు తండ్రిని లేపేందుకు ప్రయత్నించగా ఎంతకూ లేవలేదు. అనంతరం ఆయన మృతి చెందినట్లు స్థానికులు గుర్తించారు. గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు, స్థానికులు పేర్కొన్నారు. అయితే మృతుడి సోదరుడు కొత్తూరు పోశం మృతిపై అనుమానం ఉన్నట్లు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.


