ప్రకృతి వ్యవసాయంపై నెదర్లాండ్స్ నిపుణుడి అధ్యయనం
ఖానాపూర్: నెదర్లాండ్స్‌కు చెందిన శాశ్వత వ్యవసాయ నిపుణుడు సచాస్ స్టైమెస్, చిన్న రైతుల జీవనోపాధిని మెరుగుపరచడంలో అగ్రోఎకాలజీపై పరిశోధన చేస్తున్నారు. ఇందులో భాగంగా మండలంలోని సింగాపూర్, గోండుగూడ గ్రామాలను సోమవారం సందర్శించారు. అరణ్య శాశ్వత వ్యవసాయ సంస్థ ఆధ్వర్యంలో ఈ పర్యటన జరిగింది. వాగెనిన్గెన్ యూనివర్సిటీలో రూరల్ సోషియాలజీలో డాక్టరల్ విద్యార్థిగా ఉన్న సచాస్, పర్మాకల్చర్ ప్రాక్టీషనర్‌గా ప్రకృతి వ్యవసాయంపై ఆసక్తి చూపుతున్నారు.
రైతుల క్షేత్రాల సందర్శన
సచాస్ ఆదిలాబాద్ రైతు ఉత్పత్తిదారుల సంస్థ నిర్వాహకులు, చిన్న రైతులైన సిడం గంగా ప్రసాద్, తొడసం సురేశ్, తుమ్రం మారుతి, కనక కిషన్, దుర్వ ఉషారాం, పెందూర్ బొజ్జు, కొట్ట నాగేష్ క్షేత్రాలను పరిశీలించాడు. రైతులతో సమావేశమై, రసాయనిక వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం మధ్య తేడాలు, ఖర్చులు, ఉత్పత్తుల గురించి తెలుసుకున్నాడు. ప్రకృతి సిద్ధంగా సాగు చేస్తున్న పండ్ల మొక్కలు, అంతరపంటల గురించి తెలుసుకున్నాడు. ప్రకృతి వ్యవసాయం ద్వారా నేల ఆరోగ్యం మెరుగుపడుతుంది, దేశీ విత్తనాల ఉత్పత్తి పెరుగుతుంది, జీవవైవిధ్యం పెంపొందుతుందని సచాస్ పేర్కొన్నాడు.
పెట్టుబడి తక్కువ..
ఈ పద్ధతిలో పెట్టుబడులు తక్కువగా ఉంటాయి. పొలంలోనే తయారు చేసుకునే జీవన ఎరువులు, పశువుల ఏకీకరణ, దేశీ విత్తనాల ద్వారా చీడపీడలు, వ్యాధుల నియంత్రణ సాధ్యమవుతాయి. విత్తన భద్రత, ఆహార భద్రత, భూసంరక్షణ, పర్యావరణ సంరక్షణ జరుగుతాయి. దీని ద్వారా మానవులు, జీవులకు మేలు చేకూరుతుందని వివరించాడు. చిన్న, సన్నకారు, పెద్ద రైతులందరూ ప్రకృతి వ్యవసాయాన్ని అవలంబించాలని సచాస్ కోరాడు. కలప జాతులు, పండ్ల మొక్కలు, ఔషధ గడ్డి జాతులను పెంచి భూసంరక్షణ, పర్యావరణ సంరక్షణ చేయాలని సూచించాడు.
ప్రకృతి వ్యవసాయంపై నెదర్లాండ్స్ నిపుణుడి అధ్యయనం


