అంతర్రాష్ట్ర సైబర్‌ మోసగాళ్ల ముఠా అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

అంతర్రాష్ట్ర సైబర్‌ మోసగాళ్ల ముఠా అరెస్ట్‌

Feb 24 2026 7:34 AM | Updated on Feb 24 2026 7:34 AM

అంతర్రాష్ట్ర సైబర్‌ మోసగాళ్ల ముఠా అరెస్ట్‌

అంతర్రాష్ట్ర సైబర్‌ మోసగాళ్ల ముఠా అరెస్ట్‌

● 1500 సెల్‌ఫోన్లు, బ్యాటరీలు స్వాధీనం ● ఎస్పీ అఖిల్‌ మహజన్‌

ఆదిలాబాద్‌టౌన్‌: అంతర్రాష్ట్ర సైబర్‌ మోసగాళ్ల ముఠాను వన్‌టౌన్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్పీ అఖిల్‌ మహజన్‌ సోమవారం వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో వెల్లడించారు. ఆదివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో తెలంగాణ చౌక్‌లో వాహనాల తనిఖీలు చేపడుతున్న క్రమంలో నలుగురు సైబర్‌ నేరగాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తర ఢిల్లీలోని భజన్‌పూరకు చెందిన మహ్మద్‌ ఇర్ఫాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన సాహిల్‌, అనస్‌, ఉత్తర ఢిల్లీకి చెందిన ఓ మైనర్‌ బాలుడు ఉన్నారు. నిందితులు కొంత కాలంగా ఆదిలాబాద్‌ పట్టణ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ పాత మొబైల్‌ ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. వాటిలోని మదర్‌బోర్డులు, బ్యాటరీలు, సాకెట్లను వేరుచేసి రిపేర్‌ చేసిన ఫోన్లలో అమర్చేవారు. పాత మొబైల్‌ ఫోన్ల ద్వారా కస్టమర్ల డాటా, ఐఎంఈఐ నంబర్లను సేకరించి బ్యాంక్‌ అధికారులమని చెబుతూ అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. వారి ఖాతాల నుంచి డబ్బులు కొల్లగొడుతున్నారు. మిగిలిన స్క్రాప్‌ మొబైళ్లను ఢిల్లీలోని తెలియని వ్యక్తులకు విక్రయించి లాభాలు పొందుతున్నారు. వీటి ద్వారా ఇతర రాష్ట్రాలు, దేశాలకు చెందిన సైబర్‌ నేరగాళ్లు మోసాలు చేసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా నలుగురిపై కేసు నమోదు చేసి వారి వద్ద నుంచి 1500 పాత మొబైల్‌ ఫోన్లను, మదర్‌బోర్డులతో పాటు బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో ఆదిలాబాద్‌ డీఎస్పీ ఎల్‌.జీవన్‌ రెడ్డి, వన్‌టౌన్‌ సీఐ సునీల్‌ కుమార్‌, ఎస్సైలు నాగనాథ్‌, అశోక్‌, రమ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement