క్యా.. తన్‌ప(లొ)ల్లి? | - | Sakshi
Sakshi News home page

క్యా.. తన్‌ప(లొ)ల్లి?

Feb 23 2026 7:00 AM | Updated on Feb 23 2026 7:00 AM

క్యా.. తన్‌ప(లొ)ల్లి?

క్యా.. తన్‌ప(లొ)ల్లి?

● ఎన్నికల కమిషన్‌ నిబంధనలు ● అధికారుల తీరుపై ఆరోపణలు

ఉల్లంఘించారంటున్న ప్రతిపక్షాలు

రామకృష్ణాపూర్‌: క్యాతనపల్లి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ రూపొందించిన మార్గదర్శకాలను పూర్తిగా పాటించలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని ప్రతిపక్ష పార్టీల సభ్యులు ఆక్షేపిస్తున్నారు. ఈనెల 16న పూర్తి కావాల్సిన మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎన్నిక నాటకీయ పరిణామాల మధ్య రెండుసార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇరుపార్టీల గొడవల కారణంగా ఎన్నిక వాయిదా పడగా ఎన్నికల అధికారులు, పోలీసుల వ్యవహారశైలిపై కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్క డ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచే ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అరెస్టులు, నిరసనలు, లాఠీచార్జీ, రాజకీయ పరమైన ఆరోపణలు, ప్రత్యారోపణలతో కొద్ది రోజులుగా పరిస్థితి ఉద్రిక్తంగానే మారింది. ఇటీవల మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అరెస్ట్‌ కావడం రాజకీయంగా మరింత వేడి రాజేసింది.

కోడ్‌ ఉల్లంఘన జరిగిందా?

మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ రూపొందించిన మార్గదర్శకాలు ఇక్కడ అధికారులు పూర్తిగా ఉల్లంఘించారన్న ఆరోపణలున్నాయి. కమిషన్‌ జారీ చేసిన 35 పేజీల సర్క్యులర్‌ను పరిశీలిస్తే నిబంధనలు ఉల్లంఘించారనేది స్పష్టమవుతోందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. నియమాల ప్రకారం ప్రమాణ స్వీకారం, ఎన్నిక సందర్భంగా సభ్యులను ఓ క్రమపద్ధతిలో కూర్చోబెట్టాల్సి ఉంది. పార్టీల వారీగా అక్షర క్రమంలో కూర్చోబెట్టడంతో పాటు ఓ పార్టీకి మరో పార్టీకి మధ్య బారికేడ్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే ఇక్కడ అలా ఏర్పాటు చేయలేదు. ఎన్నికల సమయంలో ఉపన్యాసాలు నిషేధం ఉన్నప్పటికీ మంత్రి వివేక్‌ వెంకటస్వామి ఎన్నికలకు ముందు మాట్లాడినట్లు బీఆర్‌ఎస్‌, సీపీఐ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు విరామం ఇవ్వకూడదు. కాగా, ఇక్కడ పది నిమిషాలు బ్రేక్‌ ఇవ్వటం గమనార్హం. అన్నింటికి మించి ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా ఉండేందుకు మీడియాకు అనుమతివ్వాలని స్పష్టమైన మార్గదర్శకాలున్నాయని చెబుతున్నారు. సమావేశ మందిరం చిన్నదిగా ఉంటే ప్రత్యేక ఏర్పాట్లు చేసి అవసరమైతే ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాట్లు చేసి డీపీఆర్వో ద్వారా పాస్‌లు జారీ చేసి మీడియాను అనుమతించాలి. ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల మీడియాను అనుమతించి ఇక్కడ నిరాకరించారు. అలాగే, ఎన్నికల అధికారి నియామకంపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఆర్డీవో లేదా జెడ్పీ సీఈవో స్థాయి అనుభవమున్న అధికారులను ఎన్నికల అధికారులుగా నియమించాలనే నిబంధన ఉన్నప్పటికీ ఇక్కడ తహసీల్దార్‌ స్థాయి అధికారిని నియమించారనే విమర్శలున్నాయి.

కోరం ఉండగా వాయిదా ఎలా?

క్యాతనపల్లి మున్సిపాలిటీలో మొత్తం 22 మంది కౌన్సిలర్లు, ఎక్స్‌ అఫీషియో ఓట్లతో కలిపి 24 మంది ఉండగా కోరం 13 మంది ఉంటే సరిపోతుంది. చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికల సమయంలో అందరూ హాజరు కావాలనే నిబంధన లేదని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. మంత్రి, ఎంపీ కాంగ్రెస్‌ కౌన్సిలర్లు వెళ్లిపోయాక కూడా 14మంది బీఆర్‌ఎస్‌, సీపీఐ కౌన్సిలర్లు సమావేశ గదిలోనే ఉన్నప్పటికీ గొడవలను సాకుగా చూపి ఎన్నిక వాయిదా వేయటం సమంజసమేనా? అన్న చర్చ జరుగుతోంది. కాగా, మార్గదర్శకాలు, సర్క్యులర్‌ను పరిగణనలోకి తీసుకోకుండా వ్యవహరించారనే ఆరోపణలు రుజువైతే ఎన్నికల నిర్వహణలో భాగమైన అధికారులపై చర్యలు తప్పవని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ప్రమాణ స్వీకారం, ఎన్నిక సందర్భంగా ఉద్రిక్తతలు చోటుచేసుకుంటాయనే సమాచారం నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకోలేదా? వందలాది మంది పోలీసులు మోహరించినప్పటికీ సమావేశ మందిరంలో కుర్చీలు విసురుకోవడం ఏమిటి? దానికి ముందు రాళ్లదాడి జరగడం ఏమిటి? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఎన్నికల రూల్‌ పొజిషన్‌, సర్క్యులర్‌ను పరిగణనలోకి తీసుకోకుండా నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ మొత్తం పరిణామాలు క్యాతనపల్లిలో చర్చనీయాంశంగా మారగా ఎన్నికల నిర్వహణపై ఉన్న సందేహాలకు ఎన్నికల కమిషన్‌ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement