ఎస్టీపీపీలో ఈ‘ఢీ’
అన్నీ తానై వ్యవహరిస్తున్న అధికారి ఉద్యోగుల నియామకాల్లోనూ అక్రమాలు నచ్చినవారికే కాంట్రాక్టులు అన్నిట్లో ఆయన జోక్యంపై అధికారుల గుర్రు దృష్టిసారించని యాజమాన్యం
జైపూర్:విద్యుత్ ఉత్పత్తిలో రికార్డులు సృష్టించిన జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్(ఎస్టీపీపీ) ప్రస్తుతం నిర్వహణ సమస్యలతో ఇబ్బంది పడుతోంది. ఇక్కడ 1,200 మెగావాట్ల ఉత్పత్తి జరుగుతోంది. మరో 800 మెగావాట్ల కొత్త ప్లాంటు నిర్మాణం జరుగుతోంది. సింగరేణి యాజమాన్యం ఇటీవల ఎన్టీపీసీ నుంచి వచ్చిన వ్యక్తిని ఈడీ(ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్)గా నియమించింది. ఆయనకు అనుబంధంగా ఓఅండ్‌ఎం(ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్) విభాగాధిపతిగా సింగరేణి జీఎం స్థాయి అధికారి, ఈఅండ్‌ఎం జీఎంగా మరొక సంస్థ అధికారి పనిచేస్తున్నారు. సివిల్, పర్సనల్, పర్చేజ్, ఫారెస్ట్ శాఖలకు విభాగాధిపతులు ఉన్నారు. అందరూ ఎస్టీపీపీ ఈడీ, సింగరేణి ఈఅండ్‌ఎం డైరెక్టర్ నేతృత్వంలో పనిచేయాలి.
ఆధిపత్య పోరు..
ఎన్టీపీసీ నుంచి వచ్చిన ఈడీ పలు శాఖల అధికారులపై ఆధిపత్యం సాధించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆయన తనకు అనుకూలులతో వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నారన్న చర్చ జరుగుతోంది. కొత్త ప్లాంటు నిర్మాణంలో ఉద్యోగ నియామకాల్లోనూ ఈడీ జోక్యం చేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గోదావరిఖని, ఎన్టీపీసీ, పెద్దపల్లి, మందమర్రి, బెల్లంపల్లి పట్టణాల వారికి అవకాశాలు కల్పిస్తూ ఎస్టీపీపీ ప్రభావిత గ్రామాల నిరుద్యోగులకు మొండిచేయి చూపిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పేరుకు కమిటీ ఏర్పాటు చేసి నిర్మాణ పనులు చూస్తున్న అధికారితో కలిసి డబ్బులు స్కిల్డ్ ఉద్యోగుల నియామకాల్లో అక్రమాలకు పాల్పడుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
సంస్థపై ప్రభావం
కీలక శాఖల్లో (జీఎంలు) రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్న అధికారులను నియమించడం వల్ల సంస్థ పు రోగతి, ఎస్టీపీపీ అభివృద్ధిపై ప్రభావం పడుతుంద న్న ఆరోపణలు ఉన్నాయి. స్థానిక భూనిర్వాసితులు 600కు పైగా ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకు న్నా వాటిని పక్కన పెట్టి.. ఇతర ప్రాంతాల 500 మ ందికి అవకాశం కల్పించడంపై పర్సనల్ డిపార్ట్‌మెంట్ కూడా అభ్యంతరం తెలిపినట్లు సమాచారం.
మంత్రి ఆగ్రహం
ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఇటీవల ఎస్టీపీపీ ఈడీపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఉద్యోగ నియామకాల్లో మంత్రి లేఖలను పట్టించుకోకపోవడం, స్థానికులకు అవకాశాలు కల్పించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈడీ గన్‌మెన్ సైతం ఇతరశాఖ అధికారుల అంశాల్లో జోక్యం చేసుకోవడం, ఆయా శాఖల్లోని సమాచారాన్ని ఈడీకి చేరవేస్తూ అధిపత్యానికి సహకరించడంపై ఎస్టీపీపీలో అధికారులు, వారి డ్రైవర్లు మహిళలతో వ్యవహరిస్తున్న తీరుపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


