ఎన్నికల ఉపాధి
చెన్నూర్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో యువతి, యువకులు, రోజు వారి కూలీలకు ఉపాధి లభిస్తోంది. ఎన్నికల్లో గెలుపే ఆయుధంగా మలుచుకునేందుకు అభ్యర్థులు అన్ని అస్త్రాలను ఉపయోగిస్తున్నారు. పోటీదారునికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రచారానికి కావల్సిన సామగ్రిని సమకూర్చుకున్నారు. ఖర్చులకు వెనకాడడం లేదు. అప్పులు సైతం చేసి ప్రచార సాధనల కోసం విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారు.
వేలాది మందికి ఉపాధి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల కార్పొరేషన్, చెన్నూర్, బెల్లంపల్లి, క్యాతనపల్లి, లక్సెట్టిపేట, ఆదిలాబాద్, నిర్మల్, భైంసా, ఖానాపూర్, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాల్టీల్లో వేలాది మందికి ఉపాధి లభిస్తుంది. నామినేషన్ల నుంచి ప్రచార గడువు ముగిసే వరకు ప్రచారం పాల్గొనే పురుషులు, మహిళలకు ఉపాధి దొరుకుతుంది. ఈనెల 4 నుంచి ప్రచారం షురుతో అన్నివర్గాల ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరిగాయి. ఒక్కో వార్డుకు 100 నుంచి 150 మంది పాల్గొంటున్నారు. ప్రధాన పార్టీలతోపాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు మొత్తం కలిసి రోజుకు 7 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. చెన్నూర్ మున్సిపాలిటీలో 18 వార్డులు ఉండగా, కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు కలిసి 107 మంది పోటీల్లో ఉన్నారు. ఒక్కో అభ్యర్థి ఒకటి నుంచి రెండు ప్రచార వాహనాలు ఏర్పాటు చేసుకున్నారు. మున్సిపాలిటీలో సుమారు 120 ఆటోలు, టాటాఎస్ డ్రైవర్లకు అద్దె లభిస్తోంది. మైక్ సెట్లు, లౌడ్‌స్పీకర్లు డోర్ పోస్టర్లు, స్టిక్కర్లు, ఫ్లెక్సీలు, ప్రింటర్లకు గిరాకీ పెరిగింది. ఒక్కో అభ్యర్థి వేలాది రూపాయలతో ఫ్లెక్సీలతోపాటు స్టిక్కర్లు, హ్యాండ్ పోస్టర్లు ఆర్డర్లు ఇస్తున్నారు. ఫ్లెక్సీలు, స్టిక్కర్లు అంటించడం, తదిత వంటి పనుల ద్వారా అన్నివర్గాల వారికి ఉపాధి లభించింది.
ఉపాధి వివరాలు
వేటికి సంఖ్య ఒకరోజు
కూలీ రూ.
ఆటో 1 2000
ప్రచారం 1 300
ఓటరు స్లిప్పులు 1 200
స్టిక్కర్ల పేస్ట్ 1 500
మైక్‌సెట్ 1 1000
వార్డుల వారీగా ఓటరు స్లిప్పుల పంపిణీకి యువతి, యువకులను ఏర్పాటు చేసుకున్నారు. ఒక్కో ఓటరు స్లిప్పునకు రూ.2 చొప్పున వంద స్లిప్పులు పంపిణీ చేస్తే రూ.200ల ఆదాయం వస్తోంది. ఒక్కొక్కరు 200 నుంచి 300ల ఓటరు స్లిప్పులు పంపిణీ చేస్తూ రోజుకు రూ.600 ఆదాయం పొందుతున్నారు. స్వతంత్ర అభ్యర్థులు తప్ప ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటరు స్లిప్పుల పంపిణీ చేపడుతున్నారు. దీంతో యువతకు రెండు నుంచి మూడు రోజులు కూలీ లభిస్తుంది.
ఎన్నికల ఉపాధి


