ప్రేమ పెళ్లి చేసుకున్న యువకుడి ఇంటిపై దాడి
భీమారం: ప్రేమ పెళ్లి చేసుకున్న దళిత యువకుడి ఇంటిపై యువతి బంధువులు దాడి చేసి నిప్పంటించారు. ఇంట్లోని సామగ్రి, వస్తువులు దగ్ధం కాగా..ఎవరూ లేకపోవడంతో ముప్పు తప్పింది. ఈ సంఘటన మండలంలోని దాంపూర్ గ్రామంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. బాధితులు, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దళితుడు పెద్ద పోశం కుమారుడు సులేమాన్ ఇదే గ్రామంలోని మరో సామాజిక వర్గానికి చెందిన చెర్కు అంజలిని ఈ నెల 6న కరీంనగర్‌లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. దీంతో అంజలి సోదరులు చెర్కు అంజి, సంపత్, తండ్రి లచ్చలు కలిసి శుక్రవారం రాత్రి సులేమాన్ ఇంటికి వెళ్లి గొడవ చేశారు. ఎవరూ లేకపోవడంతో ఇంట్లోని వస్తువులు, సామగ్రికి నిప్పంటించారు. సంఘటన స్థలాన్ని జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్‌రావు, సీఐ నవీన్‌కుమార్, ఎస్సై రాజేందర్ పరిశీలించారు. బాధితుడు పెద్ద పోశం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శనివారం ఉదయం అంజి, సంపత్, లచ్చలును అవిడం ఎక్స్‌రోడ్డు వద్ద అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు ఏసీపీ వెంకటేశ్వర్‌రావు తెలిపారు.


