సర్పంచ్.. ఇంటి పేరైంది..!
లక్సెట్టిపేట: ఊత్కూరు పంచాయతీ పరిధి గంపలపల్లి గ్రామానికి చెందిన వొడ్డపల్లి రాజలింగయ్య (67) సర్పంచ్‌గా సేవలందించారు. సుదీర్ఘంగా తన రాజకీయ జీవితం అంతా సర్పంచ్‌గా కొనసాగగా, సర్పంచ్ రాజలింగయ్యగానే ఇంటి పేరైంది. ఊత్కూరు పంచాయతీ పరిధి హామ్లెట్ గ్రామం గంపలపల్లి నుంచి నాలుగుసార్లు సర్పంచ్‌గా గెలుపొందారు. 1974లో పదో తరగతి పూర్తి చేసి 1981లో తొలిసారిగా సర్పంచ్‌గా విజయం సాధించారు. కాంగ్రెస్ మద్దతుతో 1988లో సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 1996లో ఓడి, 2001, 2013లో గెలుపొందారు. 2018లో ఊత్కూరు పంచాయతీ మున్సిపాలిటీలో విలీనం కాగా, ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ప్రస్తుతం 9వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పోటీ చేస్తున్నారు. ఊత్కూరు నుంచి మున్సిపాలిటీకి ఆదాయం వస్తున్నప్పటికి ఇక్కడ అభివృద్ధి జరగడం లేదని రాజలింగయ్య పేర్కొన్నారు. తాను గెలుపొందాక వార్డుల అభివృద్ధికి, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.


