మల్బరీసాగుపై అవగాహన కల్పించాలి
ఉట్నూర్‌రూరల్: గిరిజన రైతులకు మల్బరీ సాగు, పట్టుపురుగు పెంపకంపై అవగాహన కల్పించాలని ఐటీడీఏ పీవో యువరాజ్ మార్మట్ పేర్కొన్నారు. ఉట్నూర్‌లోని ఆయన కార్యాలయంలో వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్బరీ తోటల సాగుకు రైతులను ఎంపిక చేయాలని, వారికి కావల్సిన రాయితీ వివరాలు తెలియజేసేలా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఉట్నూర్‌లోని పట్టు పరిశ్రమ కేంద్రాన్ని బలోపేతం చేయడంతోపాటు రైతులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించా లన్నారు. అవసరమైతే ఇతర జిల్లాలకు సందర్శనకు తీసుకెళ్లాలన్నారు. జిల్లా ఉద్యాన అధికారులు నర్సయ్య, ఉద్యానవన అధికారి సందీప్ కుమార్, సీపీఎఫ్ సత్యనారాయణ, విజయ్, బెయిఫ్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.


