సమ్మక్క–సారలమ్మకు ఎత్తు బంగారం
మంచిర్యాలరూరల్(హాజీపూర్): రెండేళ్లకోసారి జరి గే సమ్మక్క–సారలమ్మ జాతరలో భాగంగా ఆదివా రం భక్తులు ఇళ్లల్లో అమ్మవార్లకు పూజలు చేసి మొ క్కులు చెల్లించుకున్నారు. ఇక జాతరకు వెళ్లి మొక్కులు చెల్లించుకోవడమే మిగిలి ఉంది. ఈ నెల 28నుంచి 31వరకు సమ్మక్క–సారలమ్మ మహాజాతర సందర్భంగా చివరిరోజున తల్లులకు అత్యంత ఇష్టమైన బంగారం (బెల్లం) భక్తులు నిలువెత్తు సమర్పించుకోనున్నారు. జిల్లా కేంద్రంతో పాటు బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్, రామకృష్ణాపూర్ తదితర ప్రాంతాల్లో అమ్మవార్లకు పెద్ద ఎత్తున ఇప్పటికే మొక్కులు చెల్లించుకున్నారు. బెల్లం విక్రయించే ప్రధాన మార్కెట్లు భక్తులతో కిటకిటలాడాయి. జాతర సమీపించడంతో బెల్లం అమ్మకాలు జోరుగా సాగాయి. నిలువెత్తు బెల్లం తూకం వేయించి తలలపై ఎత్తుకుని ఇళ్లకు వెళ్లారు. ఆ తర్వాత బెల్లంతోపాటు మేకలు, కోళ్లతో అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. వీధుల్లో బెల్లాన్ని పంచిపెట్టారు.


