అర్హత లేని వైద్య కేంద్రాలపై ఫిర్యాదు
మంచిర్యాలటౌన్: మంచిర్యాలలో అర్హత లేకుండా వైద్యం చేస్తున్న కేంద్రాలను గుర్తించామని, తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేస్తామని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ యెగ్గన శ్రీనివాస్ తెలిపారు. జిల్లా కేంద్రంలో మంగళవారం టీజీఎంసీ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు. గతంలో కంపౌండర్‌గా పనిచేసిన అనుభవాన్ని ఆసరాగా చేసుకుని పలువురు కనీస వైద్య, విద్యార్హతలు, లైసెన్స్ లేకుండా తమకు తామే వైద్యులమని చెప్పుకుని అల్లోపతి మందులు, స్టెరాయిడ్లు, యాంటీ బయోటిక్స్, పెయిన్ కిల్లర్ వంటివి ఇస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. హమాలీవాడలో షాకీర్ రెండు పడకలతో దవాఖాన నిర్వహిస్తూ పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్లు, ఐవీ ఫ్లూయిడ్స్, మల్టీవిటమిన్ ఇంజక్షన్లు ఇస్తూ పట్టుబడ్డ్డాడని తెలిపారు. హరి మెడికల్ షాపులో ఒక పడకతో ప్రకాష్ అనే నకిలీ వైద్యుడు రోగులకు యాంటీ బయాటిక్ ఇంజెక్షన్లు, నెబ్యులైజేషన్ ఇస్తూ వైద్యం చేస్తున్నాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ సెక్రెటరీ డాక్టర్ అనిల్ కుమార్, హెచ్‌ఆర్‌డీఏ సభ్యుడు డాక్టర్ ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.


