గురుకుల ప్రవేశ పరీక్షకు ‘సాధన’
మంచిర్యాలఅర్బన్: వసతితో కూడిన విద్య అంది స్తూ పేద విద్యార్థులకు గురుకులాలు అండగా నిలుస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ జనరల్ గురుకులాల్లో వచ్చే విద్యా సంవత్సరానికి 2026–27 సంబంధించి ప్రవేశాలకు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యాలయాల సంస్థ నోటిఫికేషన్ జారీచేసింది. సర్కారు బడిలో చదివే నాలుగో తరగతి విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఎక్కువగా ఉంటున్నా ఐదో తరగతిలో ప్రవేశాలు పొందలేకపోతున్నారు. ప్రశ్నల సరళిపై అవగాహన లేకపోవడంతో వారు వెనకబడిపోతున్న విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు సాధన గురుకుల ఐటెం బ్యాంకు పేరిట రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ మండలి పుస్తకాలు పంపిణీ చేయనుంది. ఒక్కోరోజు ఒక్కో అంశాన్ని పిల్లలకు ప్రత్యేకంగా నేర్పిస్తారు. రెండు నమూనా పరీక్షలు నిర్వహించి పోటీ తట్టుకునేలా సమాయత్తం చేయనున్నారు.
పుస్తకాలు ఇలా..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నాలుగవ తరగతి విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు తెలుగు, ఇంగ్లిష్‌లో సాధన గురుకుల ఐటమ్ బ్యాంకు పుస్తకాలు ముద్రించారు. ఆదిలాబాద్ జిల్లాలో 1690, కుమరంభీం ఆసిఫాబాద్‌కు 1814, నిర్మల్‌కు 1582, మంచిర్యాలకు 1662 పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. ఒక్కో మంచిర్యాల జిల్లాలోనే నాలుగవ తరగతి చదివే విద్యార్థులు 3525 మంది ఉండగా 1662 పుస్తకాలు మాత్రమే జిల్లాకు సరఫరా చేశారు. బోధనకు ఉపాధ్యాయులు పుస్తకాలు ఉపయోగిస్తారా? లేదా విద్యార్థులకు అందిస్తారా అనేది తెలియాల్సి ఉంది. సర్కారు బడిలో చదివే విద్యార్థులు సాధనతో ఎంతో ఉపయోగకరంగా మారనుంది. రెండు, మూడు రోజుల్లో పుస్తకాల సరఫరా చేయనున్నట్లు అధికారులు తెలిపారు.


