పథకం ప్రకారమే హత్య చేశారు
చెన్నూర్‌రూరల్: ఒడిస్సా నుంచి పనికోసం వచ్చిన జితేన్ దర్వ (19)ను పథకం ప్రకారమే హత్య చేశారని జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. చెన్నూర్ పోలీస్ స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. చెన్నూర్ మండలంలోని సుబ్బరాంపల్లి ఇటుక బట్టీల్లో పని చేసేందుకు ఒడిస్సా నుంచి 20 మంది కూలీలు వచ్చి ఇక్కడే ఉంటున్నారు. జితేన్ ధర్వ, రాజేందర్ భీమల్, శుభ్రత్ కుమార్‌తో పాటు మరో మైనర్ బాలుడు కలిసి ఉంటున్నారు. ఆదివారం రాజేందర్ భీమల్ సెల్‌ఫోన్ తీసుకొని జితేన్ ధర్వ తన భార్యకు ఫోన్‌చేసి మాట్లాడుతూ గొడవపడ్డాడు. గమనించిన బాలుడు అతని వద్ద నుంచి ఫోన్ తీసుకుని ఎందుకు గొడవపడుతున్నారని అడిగాడు. దీంతో జితేన్ ధర్వ బాలుడిని కొట్టడంతో రాజేందర్ భీమల్, శుభ్రత్ కుమార్‌కు విషయం చెప్పాడు. దీంతో ముగ్గురూ కలిసి జితేన్ ధర్వను చంపుదామని పథకం వేసుకున్నారు. సాయంత్రం ముగ్గురూ కలిసి గదిలో జితేన్ ధర్వ మెడకు ఉరి బిగించి హత్య చేశారు. మృతదేహాన్ని చెట్టుకింద పడేసి మేమే చంపామని మిగతా కూలీలకు చెప్పి పారిపోయారు. మంగళవారం చెన్నూర్‌లోని ఆస్నా ద్ ఎక్స్‌రోడ్డు వద్ద పోలీసులు వారిని పట్టుకుని హత్యకు ఉపయోగించిన టవల్‌తో పాటు రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన పట్టణ సీఐ దేవేందర్‌రావు, ఎస్సైలను ఏసీపీ అభినందించారు.


