అంత్యక్రియలకు వచ్చి అనంతలోకాలకు..
దిలావర్‌పూర్: బంధువు అంత్యక్రియలకు వచ్చి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని నర్సాపూర్(జి) గ్రామానికి చెందిన గడ్డం నిఖిల్ (21) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల స్వగ్రామంలో సమీప బంధువు చనిపోవడంతో అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వచ్చాడు. తిరుగు ప్రయాణంలో సోమవారం రాత్రి అదే గ్రామానికి చెందిన అతని స్నేహితుడు నీరటి హర్షరాజ్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై నిర్మల్‌కు బయలుదేరాడు. నిర్మల్–భైంసా రహదారిపై న్యూలోలం గ్రామ సమీపంలో రోడ్డుకు అడ్డుగా వచ్చిన అటవీ జంతువును తప్పించే క్రమంలో బైక్ అదుపుతప్పి కిందపడిపోయింది. ఘటనలో బైక్ నడుపుతున్న నిఖిల్‌కు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెనక కూర్చున్న హర్షిత్‌రాజ్‌కు గాయాలు కావడంతో నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.


