ముసాయిదా జాబితా సవరించండి
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: జిల్లాలోని మంచిర్యాల నగరం, పట్టణాల్లో విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాపై అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. మంచిర్యాల కార్పొరేషన్‌తో సహా మున్సిపాల్టీలు బెల్లంపల్లి, చెన్నూరు, క్యాతనపల్లి, లక్షెట్టిపేటలో అనేక అర్జీలు వస్తున్నాయి. స్థానిక తాజా, మాజీ ప్రజాప్రతినిధులు, పలు రాజకీయ పార్టీ నాయకులు వార్డులు, డివిజన్లలో ఉన్న తప్పులపై దరఖాస్తులు అందజేస్తున్నారు. వీటిలో ముఖ్యంగా ఒక వార్డులో ఇళ్లు ఉంటే మరో వార్డులోని ఓటరు జాబితాలో ఓట్లు ఉండడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలింగ్ సమయంలో ఇబ్బంది పడాల్సి వస్తుందని, ఇళ్లు ఉన్న వార్డులోనే కొనసాగించాలని కోరుతున్నారు. ఇక వార్డుల సరిహద్దుల్లోనూ తప్పిదాలు ఉన్నట్లు గుర్తిస్తున్నారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తరహాలోనే మృతుల ఓట్లను జాబితా నుంచి తొలగించలేదు. దీంతో తమ వార్డులో ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తున్నాయని, మరోవైపు ఓటింగ్ సమయంలోనూ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని, దీంతో ఆ ఓట్లను ధ్రువీకరించి తొలగించాలని కోరుతున్నారు. అంతేకాక వలస వెళ్లిన వారు, వేరే చోటుకు ఓట్లు మార్పిడి చేసుకున్న వారి వివరాలను తొలగించాలని వినతి ఇస్తున్నారు. ఆయా వార్డుల్లో పోటీలో నిలవాలని ఆరాటపడుతున్న నాయకులు ఓటరు జాబితా, తప్పులు దొర్లడంపై అధికారులకు వినతులు ఇస్తున్నారు. సోమవారం మున్సిపల్ అధికారులు రాజకీయ పార్టీల నాయకులతో నిర్వహించిన సమావేశంలోనూ ముసాయిదా ఓటరు జాబితాను సవరించాలంటూ చర్చకు వచ్చింది.
సోమవారం వరకు వచ్చినవి..
మున్సిపాలిటీ/నగరం అభ్యంతరాలు
మంచిర్యాల 239
క్యాతనపల్లి 205
చెన్నూరు 71
లక్షెట్టిపేట 57
బెల్లంపల్లి 36


