‘మీ సేవా’ నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: మీ సేవా కేంద్రాల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య నిర్వాహకులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన వ్యవసాయ అధికారి సురేఖ, ఈ–డిస్ట్రిక్ట్ మేనేజర్ సునీల్‌తో కలిసి మీ సేవా కేంద్రాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ చంద్రయ్య మాట్లాడుతూ జిల్లాలో మీ సేవా కేంద్రాలు ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలకు దరఖాస్తు చేసుకునేలా చూడాలని తెలిపారు. పని వేళలు పాటించాలని, వివిధ సేవలకు నిర్దేశించిన ధరల పట్టిక ప్రదర్శించాలని, నిర్దేశిత రుసుంకు మించి వసూలు చేయకూడదని పే ర్కొన్నారు. ప్రతీ మీ సేవ కేంద్రంలో హెల్ప్‌లైన్ సెంటర్, తహసీల్దార్ పేరు, మొబైల్ నంబరు ప్రదర్శించాలని, మార్చిలోగా అనుమతులు పునరుద్ధరించుకోవాలని సూచించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రతీ రైతుకు గుర్తింపు సంఖ్య కేటా యించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని, మీ సేవా కేంద్రాలకు అవకాశం కల్పిస్తామని, ఇబ్బందులు తలెత్తకుండా ప్రక్రియ నిర్వహించాలని పేర్కొన్నారు.


