సహజ వ్యవసాయంతో అధిక లాభాలు
బెల్లంపల్లిరూరల్: సహజ వ్యవసాయంతో అధిక దిగుబడులు, లాభాలు ఆర్జించవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి ఏ.సురేఖ అన్నారు. సోమవారం మండలంలోని చంద్రవెల్లి గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సహజ వ్యవసాయంపై అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధిక మోతాదులో రసాయనిక ఎరువుల వినియోగం వల్ల భూమి సారం కోల్పోవడంతోపాటు మానవాళి ఆరోగ్యం క్షీణిస్తుందని తెలిపారు. సేంద్రియ ఎరువులు జీవామృతం, బీజామృతం వినియోగిస్తూ పంట సాగు చేస్తే అధిక లాభాలు పొందవచ్చని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సహజ వ్యవసాయం పథకంలో చంద్రవెల్లి గ్రామం ఎంపికై ందని, 125మంది రైతులకు ఒక్కో ఎకరంలో సహజ వ్యవసాయ సాగుపై మెళకువలు, సూచనలు చేస్తామని తెలిపారు. కృషి విజ్ఞాన కేంద్రంలో రైతులకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏడీఏ రాజానరేందర్, మండల వ్యవసాయాధికారి ప్రేమ్‌కుమార్, చంద్రవెల్లి సర్పంచ్ చిలుముల శ్రీనివాస్, ఉప సర్పంచ్ గజ్జెల్లి రాజ్‌కుమార్, కేవీకే శాస్త్రవేత్త ప్రియసుగంధి, ఏఈవోలు తిరుపతి, శ్రీనివాస్ పాల్గొన్నారు.


