ఎంసీసీ కార్మికుల రిలేనిరాహార దీక్ష
పాతమంచిర్యాల: జిల్లా కేంద్రంలోని మంచిర్యాల సిమెంటు కంపెనీ(ఎంసీసీ) తొలగింపు కార్మికులు తమకు రావాల్సిన బెనిఫిట్‌లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం కంపెనీ ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ నెల 12వరకు దీక్షలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. కార్మికులు మాట్లాడుతూ కంపెనీ యాజమాన్యం నష్టాల సాకు చూపి ఉత్పత్తి యూనిట్లు మూసి వేసిందని, మొండిగా వ్యవహరిస్తూ జీతభత్యాలు చెల్లించడం లేదని తెలిపారు. ఇటీవల ఎంసీసీని బ్యాంకు అధికారులు వేలం వేస్తారనే సమాచారంతో కార్మికుల్లో ఆందోళన మొదలైందని అన్నారు. కార్మికులకు చెల్లించాల్సిన సొమ్ము చెల్లించిన తర్వాతే ఏదైనా జరగాలని, లేనిపక్షంలో కంపెనీ భూముల్లో గుడిసెలు వేసుకుంటామని స్పష్టం చేశారు. ఒక్కొక్కరికి రూ.50లక్షలు నష్టపరిహారంతోపాటు కంపెనీ ఆవరణలోని ప్రభు త్వ భూమిలో ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నష్టపరిహారం చెల్లించాలని, రాజకీయ పా ర్టీలు సహకరించాలని కార్మికులు సలిగంటి మహేందర్, అల్కారీ రాజన్న కోరారు.


